భారతీయ జుమ్లా పార్టీ బీజేపీ.. ఖమ్మం సభలో సమరశంఖం
బీజేపీని భారతీయ జుమ్లా పార్టీగా అభివర్ణించారు పంజాబ్ సీఎం భగవంత్ మన్. బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారని, మార్పుకి ఇదే తొలి అడుగు అని అన్నారాయన.
ఖమ్మం బీఆర్ఎస్ సభలో బీజేపీపై సమరశంఖం పూరించారు నేతలు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆ పార్టీకి చెందిన పంజాబ్ సీఎం భగవంత్ మన్.. బీజేపీ పాలనపై ధ్వజమెత్తారు. బీజేపీని భారతీయ జుమ్లా పార్టీగా అభివర్ణించారు పంజాబ్ సీఎం భగవంత్ మన్. బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారని, మార్పుకి ఇదే తొలి అడుగు అని అన్నారాయన.
కంటి వెలుగు మాక్కూడా కావాలి..
సభకు ముందు కంటి వెలుగు రెండో దశను ముఖ్యమంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు అందుతున్న ప్రయోజనాన్ని కళ్లారా చూసిన సీఎంలు తమ రాష్ట్రాల్లో కూడా అలాంటి మంచి కార్యక్రమాలు చేపడతామన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని పంజాబ్ లో కూడా అమలు చేస్తామన్నారు సీఎం భగవంత్ మన్. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దేశం ఎటు వెళ్తుందోననే ఆందోళన ప్రజల్లో నెలకొందని అన్నారు భగవంత్ మన్.
Watch Live: BRS Party's mammoth public meeting at Khammam, Telangana. #BRSforIndia #AbkiBaarKisanSarkar https://t.co/GjiibdkQct
— BRS Party (@BRSparty) January 18, 2023
2కోట్ల ఉద్యోగాలేవి..?
అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 2కోట్ల మందికి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, నిరుద్యోగుల్ని మోసం చేసిందని, కనీసం ఇప్పటి వరకూ మొత్తం 2కోట్ల ఉద్యోగాలివ్వలేకపోయిందని, నియామక ప్రక్రియలు కూడా అరకొరగానే చేపట్టారని, అగ్నివీర్ పేరుతో సైన్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు భగవంత్ మన్. ప్రజల ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని మోసం చేశారన్నారు. హమీలు నెరవేర్చకుండా బీజేపీ.. భారతీయ జుమ్లా పార్టీగా మారిందన్నారు. లూటీ చేయడం, దేశ సంపదను అమ్మేయడం.. ఇదే బీజేపీ సిద్ధాంతమని చెప్పారు. కేంద్ర సంస్థలైన ఎల్‌ఐసీ, రైల్వేను అమ్మడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. పంజాబ్ లో ఆప్ చరిత్రాత్మక విజయాన్ని సాధించిందని, పంజాబ్ లో అవినీతిని రూపుమాపామని చెప్పారు. తెలంగాణ స్ఫూర్తితో పంజాబ్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు.