మంత్రులతో ప్రజల ముఖాముఖి నేడు
ఈ కార్యక్రమానికి హాజరుకానున్నరెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమానికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరుకానున్నారు. కొంతకాలంగా గాంధీ భవన్‌లో ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనున్నది. ప్రజావాణిని ఏర్పాటు చేసినా ప్రారంభంలో అక్కడికి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వెళ్లారు.కానీ ప్రభుత్వ తీరు, వివిధ సమస్యలపై అక్కడ నిరసన కార్యక్రమాలు జరగడంతో ఆ ప్రాంతంలో బారికేడ్లతో భద్రత ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి సామాన్య ప్రజలు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి వచ్చి సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా వినతి పత్రాలు ఇస్తూ కోరుతున్నారు. ఇక్కడికి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు జరిగిన మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో సుమారు 1500 మంది తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. వీటిలో ఎన్ని పరిష్కరించారో తెలియదు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో సమస్యల పరిష్కారానికి వచ్చిన వాళ్లు కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలతో నేరుగా మాట్లాడాల్సి వస్తే అక్కడిక్కడే కాల్ చేస్తున్నారని, నిధులు, ఇందిరమ్మ ఇండ్లు, ఫించన్లు, కొత్త రేషన్ కార్డుల వంటి అంశాలపై మాత్రం స్పష్టత లేదంటున్నారు.