నల్గొండ టీచర్స్ స్థానంలో పీఆర్‌టీయూ అభ్యర్థి ముందంజ
సెకండ్ ప్రయారిటీ ఓట్లలోనూ శ్రీపాల్ రెడ్డిదే లీడ్

నల్గొండ - ఖమ్మం - వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ అభ్యర్థి పింగిళి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో స్పష్టమైన ఆదిక్యం కనబరిచిన శ్రీపాల్ రెడ్డి సెకండ్ ప్రయారిటీ ఓట్లలోనూ లీడ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే 13 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసి వారికి వచ్చిన సెకండ్ ప్రయారిటీ ఓట్లను ఇతర అభ్యర్థులకు కలిపారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి 6,035 ఓట్లు రాగా 13 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత సెకండ్ ప్రయారిటీ ఓట్లలో 6,105 ఓట్లు వచ్చాయి. యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి ఫస్ట్ ప్రయారిటీలో 4,820 ఓట్లు రాగా సెకండ్ ప్రయారిటీలో 4,884 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డికి ఫస్ట్ ప్రయారిటీలో 4,437 ఓట్లు, సెకండ్ ప్రయారిటీలో 4,502 ఓట్లు వచ్చాయి. మరో స్వతంత్ర అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కు ఫస్ట్ ప్రయారిటీలో 3,115 ఓట్లు, సెకండ్ ప్రయారిటీలో 3,202 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డికి ఫస్ట్ ప్రయారిటీలో 2,289, సెకండ్ ప్రయారిటీలో 2,337 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి సుందర్ రాజ్ కు ఫస్ట్ ప్రయారిటీలో 2,040 ఓట్లు, సెకండ్ ప్రయారిటీలో 2,091 ఓట్లు వచ్చాయి. 494 ఓట్లు చెల్లుబాటు కాలేదు. 439 ఓట్లు సాధించిన కొలిపాక వెంకటస్వామి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 23,641 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 11,822 ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు. శ్రీపాల్ రెడ్డి విజయం సాధించాలంటే ఇంకా 5,717 ఓట్లు రావాలి. రెండో స్థానంలో నర్సిరెడ్డి విజయం సాధించాలంటే 7,002 ఓట్లు రావాల్సి ఉంది. అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి సుందర్ రాజ్, బీజేపీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థులు పూల రవీందర్, హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత కాని ఫలితం తేలే అవకాశం కనిపించడం లేదు.