Telugu Global
Telangana

ఒకవైపు నిరసనలు మరోవైపు మార్కింగ్‌

మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న సర్వే. చావోరేవో తేల్చుకుంటాం తప్పా ప్రభుత్వం ఇచ్చే ఏ పరిహారం అక్కరలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు

ఒకవైపు నిరసనలు మరోవైపు మార్కింగ్‌
X

మూసీ నది పరివాహక ప్రాంతంలో బాధితుల నిరసనల మధ్య రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. మూసీ నది ఆక్రమణలను గుర్తించి మార్క్‌ చేస్తున్నారు. చాదర్‌ఘాట్‌, మూసా నగర్‌, శంకర్‌ నగర్‌ ప్రాంతాల్లో పోలీస్‌ బందోబస్త్‌ మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు. శంకర్‌ నగర్‌ ప్రాంతంలో మూడు బృందాలు సర్వే చేస్తున్నాయి. హియాయత్‌నగర్‌, షేక్‌ పేట, మారేడ్‌పల్లి తహశీల్దార్‌ల ఆధ్వర్యంలో మూడు బృందాలతో సర్వే జరుపుతున్నది. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాలను రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. మూసీ నదీలోని బఫర్‌ జోన్‌లో ఉన్న నిర్మాణాలకు మార్క్‌ చేస్తున్నారు. బాధితులకు పునరావాసం కల్పించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. బాధితులకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన తర్వాతే తరలింపు ఉంటుందని ఆందోళన చెందవద్దని అంటున్నారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. హైదరాబాద్‌లో 16 బృందాలతో , రంగారెడ్డిలో నాలుగు బృందాలతో, మేడ్చల్‌ జిల్లా పరిధిలో ఐదు బృందాలతో సర్వే చేస్తున్నారు. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను సర్వే బృందాలు సేకరిస్తున్నాయి. మూసీ నదిలో ఉన్న బఫర్‌ జోన్‌లోని నిర్మాణాలకు అధికారులు మార్క్‌ చేయనున్నారు.

మూసీ నదీ ప్రక్షాళనలో భాగంగా నివాసాలు కోల్పోయేవారికి పునరావసం కల్పించడానికి మూసీ రివర్‌ ఫ్రంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. నదీ గర్భంలో నిర్మాణాలను తొలిగించడానికి అధికారులు రంగంలోకి దిగారు. అర్హులైన నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌లు కేటాయించడానికి మరోసారి రీసర్వే చేస్తున్నారు. ఇంటి యజమానుల నుంచి ఇంటి పత్రాలు, ఆధార్‌ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరిస్తున్నారు.

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ బహదూర్‌పురా ప్రాంతంలో మూసీ నది రివర్‌ బెల్ట్‌ లో ఉన్న ఇండ్ల వివరాలను రెవెన్యూ అధికారులు మార్కింగ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ పాతబస్తి, కిషన్‌ బాగ్‌, నందిముసలైగూడ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఐదు టీమ్‌లుగా ఏర్పడి పోలీసుల సాయంతో సర్వే చేస్తూ మార్కింగ్‌ చేస్తున్నారు. సుమారు 360 ఇండ్లు మూసీ రివర్‌ బెడ్‌ లోకి వస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

గోల్కొండ రెవెన్యూ పరిధిలోని లంగర్‌ హౌస్‌లో ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా రివర్‌ బెడ్‌ ఉన్న ఇండ్లను గుర్తించి వాటికి మార్కింగ్‌ చేస్తున్నారు. లంగర్‌ హౌస్‌ ఆశ్రమ్‌ నగర్‌లో మార్కింగ్‌ చేస్తున్నసమయంలో అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. 45 ఇండ్లకు అధికారులు రివర్‌ బెడ్‌ లో ఉన్నట్లు గుర్తించి వాటికి మార్కింగ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదట స్థానికులు అడ్డుకున్నా.. అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి మార్కింగ్‌ చేకుంటూ వెళ్లారు.

ప్రభుత్వ చర్యలపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ ఇలా చేయడం దారుణమని మండిపడ్డారు. అక్కడ ఇండ్లు కోల్పోయే వారు మాట్లాడుతూ.. మేం ఇండ్లపై లోన్‌ తీసుకున్నామని, ఆ బాకీ కూడా ఇంకా తీరలేదన్నారు. ఈ బాకీ మొత్తం ప్రభుత్వం కట్టి అంతపెద్ద ఇల్లు వేరే చోట ఇస్తామంటే అప్పడు అంగీకరిస్తామన్నారు. పెద్ద పెద్ద బిల్డింగులను వదిలపెట్టి పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇరవై ఏళ్లుగా ట్యాక్స్‌ కడుతున్నాం.. పవర్‌ బిల్లు కడుతున్నాం. ఇప్పటివరకు మూసీ నుంచి ఒక్క చుక్క నీరు ఇక్కడి రాలేదన్నారు. ఎన్ని వర్షాలు వచ్చినా మాకు ఏమీ కాలేదన్నారు. ఎఫ్‌టీఎల్‌ జోన్‌ కాదని స్పష్టం చేశారు. మీరు మాకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఇప్పడు వెళ్లమంటే ఎక్కడి వెళ్లాలి? మీరు ఇచ్చే డబుల్‌ బెడ్‌ రూమ్‌ గురించి మాకు సమాచారం ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఒక్కో ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉంటాయి. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే ఎట్లా? అని నిలదీశారు. తాము ఉద్యోగాలు ఇక్కడ చేసుకుంటున్నాం. మీరు డబుల్‌ బెడ్‌ రూమ్‌ లు ఎక్కడో ఇస్తే ఎట్లా అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ముందు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు.

మా ఇండ్లన్నీ అక్రమం అంటున్నారు. ఎట్లా అక్రమం? మా దగ్గర రిజిస్టర్‌ డాక్యూమెంట్స్‌ అన్నీ ఉన్నాయి. మేము టాక్స్‌లు, విద్యుత్‌ బిల్లులు కడుతున్నాం. మాకు నల్లా నీళ్లు వస్తున్నాయి. నలభై ఏండ్లుగా సౌకర్యాలన్నీ ప్రభుత్వం మాకు కల్పిస్తున్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంతకు ముందు నుంచి ఉన్నది. అప్పుడు వాళ్లు నిద్రపోయారా? అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఇకవేళ ఇవి అక్రమ నిర్మాణాలు అనుకుంటే ఎందుకు ఇక్కడ రోడ్‌ వేశారు? అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కదోవ పట్టించడానికే ఇదంతా చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక ఆ అంశాన్ని డైవర్ట్‌ చేయడానికి కూల్చివేతలు మొదలుపెట్టారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఓట్ల కోసం మా ఇంటికి వచ్చారు. మీము వాళ్ల ఇంటికి వెళ్లలేదని మరికొంతమంది మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఏ డబుల్‌ బెడ్‌ రూమ్ లు మాకు అవసరం లేదన్నారు. రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి కూలగొడుతామంటే మా ఇండ్లు ఏం కావాలి? మా పిల్లలు ఏం కావాలి? ప్రభుత్వం కక్షపూరితంగా ప్రజలపై దుశ్చర్యకు పాల్పడుతున్నదని ఇక్కడ ఉన్న ప్రజలు చావోరేవో తేల్చుకుంటారు తప్పా తమ ఇండ్లను కూలగొడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మాకు ఏ డబుల్‌ బెడ్‌ రూమ్‌లు, పరిహారాలు వద్దని.. మీకు దండం పెడుతాం. ఇంటికొక విషం బాటిల్‌ ఇవ్వండి అని. అప్పుడు మీకు ఎన్నికిలోమీటర్లు కావాలంటే అన్ని తీసుకోండి అని మరో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

First Published:  26 Sept 2024 2:04 PM IST
Next Story