Munugode bypoll: రాజగోపాల్ రెడ్డికి నిరసన... గ్రామస్థులపై బీజేపీ కార్యకర్తల దాడి
Munugode bypoll: మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి చుక్కెదురైంది. రాజ గోపాల్ రెడ్డి గ్రామంలోకి అడుగుపెట్టగానే అడ్డువచ్చిన గ్రామస్తులు నిరసన తెలిపారు. ఆయనకు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే బీజేపీ కార్యకర్తలు గ్రామస్తులపై దాడికి దిగారు.
మునుగోడు ఎన్నికలో ప్రజలనుండి బీజేపీకి అవమానాలు తప్పడం లేదు. రాజ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ లో చేరినందుకు ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంగా ఉండగా , ఇంత కాలం ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఏమీ చేయలేదని, కనీసం నియొజకవర్గానికి రాలేదని ప్రజలు కోపంగా ఉన్నారు. దాంతో రాజ్ గోపాల్ రెడ్డికి, బీజేపీకి అడుగడుగునా నిరసనలు తప్పడంలేదు.
మూడురోజుల క్రితం రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మీ, ఆమెతో పాటే బీజేపీ నాయకురాలు డికే అరుణకు చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో చుక్కెదురైంది. గ్రామస్థులతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళిద్దరినీ అడ్డుకున్నారు. లక్ష్మి గో బ్యాక్… బిజేపి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులకు ఈ గ్రామంలోకి రావొద్దు అంటూ అడ్డుకున్నారు. గతంలో గ్రామాభివృద్ధికి ఇచ్చిన మాటలను పట్టించుకోలేదని నిలదీశారు. టీఆరెఎస్ మీద విమర్శలు చేసిన డికే అరుణ పై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోమటి రెడ్డి లక్ష్మి తన ప్రచారాన్ని ముగించుకొని వెనుతిరిగి తప్పలేదు.
ఈ రోజు అదే గ్రామంలో రాజగోపాల్ రెడ్డికి అదేవిధమైన నిరసన ఎదురైంది. రాజ గోపాల్ రెడ్డి గ్రామంలోకి అడుగుపెట్టగానే అడ్డువచ్చిన గ్రామస్తులు నిరసన తెలిపారు. ఆయనకు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా ప్లకార్డ్స్ ప్రదర్శించారు. కాంట్రాక్టులు కోసం కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ప్రజలకు ద్రోహం చేసిన రాజ్ గోపాల్ రెడ్డి గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు.
ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డితో పాటు వచ్చిన బీజేపీ కార్యకర్తలు గ్రామస్తులపై దాడికి దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీజేపీ కార్యకర్తల దాడిలో పలువురు గ్రామస్తులకు గాయాలు కావడంతో గ్రామం మొత్తం ఒక్కటయ్యి రాజగోపాల్ రెడ్డి వాహన శ్రేణికి అడ్డుపడ్డారు. ఆయన వెంటనే గ్రామం నుంచి వెళ్ళిపోవాలని నినాదాలు చేశారు. తమపై రాజగోపాల్ రెడ్డే స్వయంగా దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ధర్నాకు దిగారు. దాంతో ఇక అక్కడ తన పప్పులు ఉడకవని గ్రహించిన రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని ముగించేసి వెనుతిరిగారు.