Telugu Global
Telangana

అరవింద్‌ ఇంటిని ముట్టడించిన టీఆర్‌ఎస్ శ్రేణులు, ఉద్రిక్తత

కొందరు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆగ్రహంతో అరవింద్ ఇంట్లోకి దూసుకెళ్లారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఇంట్లో అద్దాలను పగులగొట్టారు. అక్కడే ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేశారు.

అరవింద్‌ ఇంటిని ముట్టడించిన టీఆర్‌ఎస్ శ్రేణులు, ఉద్రిక్తత
X

పార్టీ మారేందుకు ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో మాట్లాడారంటూ బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిజామాబాద్‌లోని అరవింద్ ఇంటిని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ముట్టడించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అరవింద్ ఆ సమయంలో ఇంట్లో లేకుండా జాగ్రత్తపడ్డారు.

కొందరు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆగ్రహంతో అరవింద్ ఇంట్లోకి దూసుకెళ్లారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఇంట్లో అద్దాలను పగులగొట్టారు. అక్కడే ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేశారు. అరవింద్ ఇంటి ముందే అతడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అప్రమత్తమైన పోలీసులు అరవింద్ ఇంటి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

అటు అరవింద్ వ్యాఖ్యలపై కవిత కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను పార్టీ మారుతానని మరోసారి పిచ్చిపిచ్చి కూతలు కూస్తే నిజామాబాద్ చౌరస్తాలోనే చెప్పుతో కొడతా అని అరవింద్‌కు వార్నింగ్ ఇచ్చారు. తనను బీజేపీలో చేరాల్సిందిగా బీజేపీ వ్యక్తులు అడిగింది నిజమేనని.. కానీ తెలంగాణ బిడ్డలెవరూ బీజేపీలో చేరబోరని ముఖం మీదే చెప్పానన్నారు. బీజేపీ అనుబంధ సంస్థల ద్వారా కూడా సంప్రదించారని కవిత వివరించారు.

బీజేపీ నేతలు కవితను ఆహ్వానించిన అంశాన్ని ఇటీవల కేసీఆర్‌ పార్టీ నేతలకు వివరించి.. బీజేపీ నేతలు ఇంత దుర్మార్గంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. అందుకు కౌంటర్‌గా అన్నట్టు అరవింద్‌.. తాము కవితను ఆహ్వానించలేదని.. కవితే కాంగ్రెస్‌లోకి చేరేందుకు ప్రయత్నాలు చేశారంటూ ఆరోపించారు. దాంతో టీఆర్‌ఎస్ నేతలు భగ్గుమన్నారు.

First Published:  18 Nov 2022 1:09 PM IST
Next Story