Telugu Global
Telangana

తెలంగాణ వ్యాప్తంగా రెండోరోజూ నిరసనలు..

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఎందుకని ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డికి, పరిశ్రమలకు కూడా కరెంటు ఇవ్వొద్దనే ధైర్యం ఉందా అని కవిత ప్రశ్నించారు.

తెలంగాణ వ్యాప్తంగా రెండోరోజూ నిరసనలు..
X

వ్యవసాయానికి 3 గంటల కరెంటు సరిపోతుందంటూ అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మంత్రి కేటీఆర్ పిలుపుతో నిన్న ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఊరూరా రేవంత్ రెడ్డి‌, కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. హైదరాబాద్‌ విద్యుత్‌ సౌధ వద్ద నిర్వహించిన ధర్నాలో బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కవిత రోడ్డుపై బైఠాయించారు. రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఎందుకని ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డికి, పరిశ్రమలకు కూడా కరెంటు ఇవ్వొద్దనే ధైర్యం ఉందా అని కవిత ప్రశ్నించారు. పరిశ్రమలు, వ్యాపారవేత్తలకు కరెంట్‌ వద్దని మాట్లాడే దమ్ముందా అని నిలదీశారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో రేవంత్‌ రెడ్డి ఉన్నారని.. ఆ రెండు పార్టీలు కూడా రైతులకు సరిగా విద్యుత్‌ ఇవ్వలేదని గుర్తుచేశారు. వాళ్ల పాలనలో కరెంట్‌ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రేవంత్‌ రెడ్డిని ఊరు పొలిమేర వరకు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పేదాకా కాంగ్రెస్‌ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వొద్దని సూచించారు కవిత.


రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తే ఏ రాజకీయ పార్టీకయినా సమస్య ఏముందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రైతాంగంపై మీకెందుకు అంత అక్కసు అంటూ రాహుల్‌ గాంధీని ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.


అటు మహబూబ్‌ నగర్‌ తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన నిరసనల్లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. బోయిన్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.



First Published:  12 July 2023 8:55 AM GMT
Next Story