మోడల్ స్కూళ్లలో 11 తర్వాత ప్రమోషన్లు, బదిలీలు
రాష్ట్రంలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద 25 స్కూళ్లలో రూ. 11 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పించామన్న మంత్రి పొన్నం
రాష్ట్రంలో 11 ఏళ్ల తర్వాత మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 19 వేల మందికి ప్రమోషన్లు , 35 వేల మందికి బదిలీలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ మోడల్ స్కూల్‌లో కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి మంత్రి పొన్నం విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు. అనంతరం గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థుల రోల్ ప్లేను అధికారులతో కలిసి వీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్‌లో 23 వేల మంది విద్యార్థులకు సీఎస్‌ఆర్ కింద బూట్లు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద 25 స్కూళ్లలో రూ. 11 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పించామన్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 14 భాషల్లో మాట్లాడేవారని గుర్తు చేశారు. విద్యార్థులు ఇతర భాషలు నేర్చుకోవాలని, కష్టపడి చదువుకుని వారి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. శానిటైజేషన్ సిబ్బంది కోసం నిధులు, ఉచిత విద్యుత్, తాగునీటితోపాటు అన్ని గురుకులాలకు అద్దెలు చెల్లించామన్నారు.