Telugu Global
Telangana

తెలంగాణలో ప్రమోషన్ల జాతర.. కొత్త జిల్లాలకు పూర్తి స్థాయిలో అధికారులు..

డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీ జాబితాను పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ)ను రెవెన్యూ శాఖ ఆదేశించింది. ఈ జాబితా ఈ నెల 6న ప్రభుత్వానికి సమర్పిస్తారు, 7వ తేదీ నుంచి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

తెలంగాణలో ప్రమోషన్ల జాతర.. కొత్త జిల్లాలకు పూర్తి స్థాయిలో అధికారులు..
X

తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడినా ప్రధాన పోస్ట్‌లకు ఇన్‌చార్జ్‌ల‌తో నెట్టుకుని వచ్చారు. కొత్త జిల్లాలకు పూర్తి స్థాయిలో డీఆర్వోలు, ఇతర అధికారులను నియమించేందుకు ఇప్పుడు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పదోన్నతుల ద్వారా అధికారుల్ని నియమించబోతున్నారు. ముందుగా 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభిస్తోంది. డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీ జాబితాను పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ)ను రెవెన్యూ శాఖ ఆదేశించింది. ఈ జాబితా ఈ నెల 6న ప్రభుత్వానికి సమర్పిస్తారు, 7వ తేదీ నుంచి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తూ పదోన్నతులకు అర్హులైన వారందరికీ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌(ఎస్‌జీడీసీ) హోదా కల్పిస్తారు. జిల్లాల విభజన అనంతరం భర్తీ కాకుండా మిగిలిపోయిన జిల్లా రెవెన్యూ అధికారులు, నాలుగు జిల్లాలకు అదనపు కలెక్టర్లుగా వీరికి పోస్టింగ్‌లు ఇవ్వబోతున్నారు. భూసేకరణ, భూముల రక్షణ, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ విభాగాలు, న్యాయాధికారులుగా కూడా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తారు.

వాస్తవానికి రెవెన్యూ శాఖలో 2016 నుంచి ప్రమోషన్లు ఆగిపోయాయి. 2020 ఫిబ్రవరిలో 193 మంది నాయబ్‌ తహశీల్దార్లకు మాత్రమే తహశీల్దార్లుగా పదోన్నతులు కల్పించారు. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్లకు తహశీల్దార్లుగా పదోన్నతులు కల్పిస్తున్నందున, అర్హులైన తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా, నాయబ్‌ తహసీల్దార్లకు తహశీల్దార్లుగా, సీనియర్‌ అసిస్టెంట్లకు నాయబ్‌ తహశీల్దార్లుగా, జూనియర్‌ అసిస్టెంట్లకు సీనియర్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు లభించబోతున్నాయి. దీంతో జూనియర్ అసిస్టెంట్‌లు, ఆ స్థాయి పోస్ట్‌లు ఖాళీ అవుతాయి. వీటిని డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది.

రెవెన్యూ శాఖలో పదోన్నతులు చేపట్టాలని రెండేళ్ల క్రితమే సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. కానీ అనివార్య కారణాలతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత రెవెన్యూ శాఖలో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం అవుతోంది. ప్రమోషన్‌కి అవసరమయ్యే సర్వీస్‌ను మూడేళ్ల నుంచి రెండేళ్లకు ప్రభుత్వం ఇటీవల కుదించిన నేపథ్యంలో పదోన్నతులు పొందేవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

రెవెన్యూ సిబ్బందిలో సంతోషం..

రెవెన్యూ శాఖలో పనిభారం చాలా ఎక్కువగా ఉందని, కాస్త ఆలస్యమైనా ఇప్పటికైనా పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు రెవెన్యూ సిబ్బంది. అన్ని స్థాయిల్లోని సిబ్బందికి వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పించేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పదోన్నతులు కల్పిస్తే పనిభారం ఎక్కువైనా ఉత్సాహంగా పనిచేస్తామని అంటున్నారు.

First Published:  5 Sept 2022 6:45 PM IST
Next Story