కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం పోటీ.. ఆ స్థానం కోసం బండ్ల గణేష్ దరఖాస్తు
మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, వరంగల్, పెద్దపల్లి స్థానాల కోసం అత్యధికంగా దరఖాస్తులు రాగా.. అతితక్కువగా హైదరాబాద్ స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కాంగ్రెస్‌లో లోక్‌సభ సీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ ఎన్నికల కోసం పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో పార్లమెంట్ స్థానాల కోసం గురువారం వరకు 34 దరఖాస్తులు మాత్రమే రాగా.. శుక్రవారం ఒక్కరోజే 100కు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా దరఖాస్తుల సంఖ్య 140కి చేరింది. మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, వరంగల్, పెద్దపల్లి స్థానాల కోసం అత్యధికంగా దరఖాస్తులు రాగా.. అతితక్కువగా హైదరాబాద్ స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
సికింద్రాబాద్ నుంచి కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి దరఖాస్తు చేయగా.. మల్కాజ్‌గిరి స్థానం కోసం సినీ నిర్మాత బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డి దరఖాస్తు చేశారు. అనూహ్యంగా ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాల కోసం మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు దరఖాస్తు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించారు. గడల శ్రీనివాస్ రావు తరఫున ఆయన సన్నిహితులు గాంధీభవన్‌లో దరఖాస్తు సమర్పించారు.
ఇక ఖమ్మం స్థానం కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని తరఫున ఆమె అనుచరులు దరఖాస్తు చేశారు. ఇక సీనియర్ లీడర్ వీహెచ్ సైతం ఖమ్మం స్థానం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. భువనగిరి టికెట్ కోసం పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాగర్‌కర్నూలు స్థానం కోసం మాజీ ఎంపీ మందా జగన్నాథం, మల్కాజ్‌గిరి కోసం కపిలవాయి దిలీప్‌కుమార్, నిజామాబాద్ స్థానం కోసం మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మల్కాజ్‌గిరి, వరంగల్ స్థానాల కోసం మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ దరఖాస్తు చేసుకున్నారు.