Telugu Global
Telangana

మా నానమ్మని ప్రజలు ఇంకా ఎందుకు గుర్తు పెట్టుకున్నారంటే..?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

మా నానమ్మని ప్రజలు ఇంకా ఎందుకు గుర్తు పెట్టుకున్నారంటే..?
X

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ.. గిరిజనులు, ఆదివాసీల కోసం ఎంతో చేశారని, ఆదివాసీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని అన్నారు ప్రియాంక గాంధీ. ప్రజలకు మేలు చేయాలనే ఇందిరాగాంధీ రాజకీయాలు చేశారని చెప్పారు. రాజకీయాల్లోకి ఎందరో వస్తారు కానీ కొందరే ప్రజల గుండెల్లో నిలిచిపోతారని, అలాంటి వ్యక్తి ఇందిర అని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ చనిపోయి 40 ఏళ్లవుతున్నా ఆమెను ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు ప్రియాంక. ఖానాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొన్నారు.


తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై కాంగ్రెస్‌ కు విజన్ ఉందని అన్నారు ప్రియాంక గాంధీ. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు తెలిసే తన తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతున్నా ప్రజల స్వప్నం పూర్తిగా నేరవేరలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంలో జీవితాలు మారుతాయని ఉద్యమకారులు కలలు కన్నారు కానీ అలాంటిదేమి జరగలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. టి.ఎస్.పి.ఎస్.సి. వైఫల్యం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటు వేస్తేనే తెలంగాణలో యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు ప్రియాంక గాంధీ.

First Published:  19 Nov 2023 2:42 PM IST
Next Story