నేడు ప్రియాంక, రేపు రాహుల్.. స్పీడు పెంచిన టీ.కాంగ్రెస్
దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. మహిళా సదస్సులో పాల్గొని ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తారు.
తెలంగాణలో నామినేషన్ల స్వీకరణకు గడువు దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరోసారి రాష్ట్రంలో పర్యటించి ప్రచారం నిర్వహించనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఇవాళ రాష్ట్రానికి రానున్న ప్రియాంక గాంధీ.. దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. మహిళా సదస్సులో పాల్గొని ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తారు. అనంతరం కొల్లాపూర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఇక బుధవారం రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ.. కల్వకుర్తి, నాగర్‌కర్నూలులో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. తర్వాత జడ్చర్ల నియోజకవర్గంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌కు హాజరవుతారు. ఆ తరువాత షాద్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి షాద్‌నగర్ క్రాస్‌రోడ్స్ వరకు పాదయాత్ర చేస్తారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు.
అక్టోబర్ 9న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రాహుల్, ప్రియాంక తెలంగాణకు రావడం ఇది రెండో సారి. అక్టోబర్ 18న ములుగులో కాంగ్రెస్ బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 19న రెండో రోజు రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలను కవర్ చేశారు. ఇక అక్టోబర్ 28న కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్ ఆ రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గాలైన తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే సంగారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో ప్రచారానికి హాజరయ్యారు.