Telugu Global
Telangana

హైదరాబాద్‌లో ప్రియాంక గాంధీ పర్యటన.. ఈనెల 8న బహిరంగ సభ

తెలంగాణ పర్యటనను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయవద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. అందుకే ఏఐసీసీ తాజాగా ప్రియాంక షెడ్యూల్ ప్రకటించింది.

హైదరాబాద్‌లో ప్రియాంక గాంధీ పర్యటన.. ఈనెల 8న బహిరంగ సభ
X

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ హైదరాబాద్ పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 8న సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన సభలో ఆమె పాల్గొననున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 5నే ప్రియాంక గాంధీ తెలంగాణ వస్తున్నట్లు ముందు ప్రకటించారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రియాంక.. 5న రాలేనని పార్టీ వర్గాలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది.

తెలంగాణ పర్యటనను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయవద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. అందుకే ఏఐసీసీ తాజాగా ప్రియాంక షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 8న ప్రియాంక హైదరాబాద్ వస్తారని స్పష్టం చేసింది. అదే రోజు బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకొని.. ఢిల్లీ వెళ్లే ముందు హైదరాబాద్ వస్తారని తెలిపారు. కాగా, ప్రియాంక గాంధీతో రెండు మూడు బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ గతంలో నిర్ణయించింది. కానీ, ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

రాష్ట్ర పార్టీలో ఉన్న లుకలుకల కారణంగా దాదాపు 10 మంది సీనియర్లు తమ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే సభల్లో పాల్గొనాలని విడివిడిగా ప్రియాంకను రిక్వెస్ట్ చేశారు. దీంతో ఆమె అసలుకే పర్యటనను రద్దు చేసుకోవాలని భావించారు. కానీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా రిక్వెస్ట్ చేయడంతో చివరి నిమిషంలో 8వ తేదీన రావడానికి ఒప్పుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ సోనియా, రాహుల్ గాంధీలతో కూడా బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సోనియా గాంధీ ఇప్పుడు పార్టీ బహిరంగ సభల్లో పాల్గొనడం లేదు. ఇటీవలే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ మీదగా సాగింది. ఆయన యాత్రకు తెలంగాణలో భారీ స్పందనే వచ్చింది. అందుకే ముందుగా ప్రియాంక సభను ఏర్పాటు చేసి.. ఆ తర్వాత ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీతో ప్రచారం చేయించాలని అధిష్టానం భావిస్తోంది.

First Published:  2 May 2023 8:25 AM IST
Next Story