Telugu Global
Telangana

జూలై 20న తెలంగాణకు ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో చేరనున్న జూపల్లి

ప్రియాంక అపాయింట్‌మెంట్లను బట్టి డేట్‌లో మార్పులు ఉండవచ్చు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

జూలై 20న తెలంగాణకు ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో చేరనున్న జూపల్లి
X

తెలంగాణ జన గర్జన పేరుతో జూలై 2న ఖమ్మంలో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. మొదటి నుంచి పొంగులేటి వెంట తిరుగుతున్న మాజీ మంత్రి జూపల్లి మాత్రం ఆ సభకు దూరంగా ఉన్నారు. తన సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో తిరిగి చేరతానని ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో జూలై 20న కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఆ రోజు జరిగే బహిరంగ సభలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరతారని పార్టీ వర్గాలు చెప్పాయి.

ఖమ్మంలో జరిగిన సభ మాదిరిగానే.. కొల్లాపూర్‌లో నిర్వహించే సభ ద్వారా పాలమూరు కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం తీసుకొని రావాలని భావిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలో ప్రియాంక గాంధీ తెలంగాణకు రావడం ఇది రెండో సారి అవుతుంది. మే 8న సరూర్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రియాంక హాజరయ్యారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ చేసింది. అంతే కాకుండా కొన్ని సంక్షేమ పథకాల ప్రకటన కూడా చేశారు. ప్రియాంక గాంధీ సభ కొల్లాపూర్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రియాంక అపాయింట్‌మెంట్లను బట్టి డేట్‌లో మార్పులు ఉండవచ్చు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

జూపల్లి కృష్ణారావు తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో జాయిన్ అయి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కూడా జూపల్లి కొల్లాపూర్ నుంచి గెలుపొందారు. కాగా, 2018లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి బి.హర్షవర్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి క్రమంగా పార్టీకి దూరమయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో జూపల్లిని బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఢిల్లీలో తెలిపారు.

పొంగులేటి తన సొంత జిల్లా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. రాహుల్ గాంధీ సమక్షంలో చేరారు. జూపల్లి ఇంకా కాంగ్రెస్‌లో చేరనందున ఆ సభకు హాజరుకాలేదు. తాను కూడా భారీ బహిరంగ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో అధికారికంగా చేరతానని ప్రకటించారు. జూలై 20న ప్రియాంకా గాంధీ అపాయింట్‌మెంట్ దాదాపు ఖరారయ్యిందని.. ఆ రోజు జరిగే బహిరంగ సభకు వస్తారని జూపల్లి వర్గీయులు చెబుతున్నారు.

First Published:  5 July 2023 2:22 AM GMT
Next Story