చేతులెత్తేసిన రాహుల్.. ఇక తెలంగాణ బాధ్యతలు చూసేది ప్రియాంక గాంధీనేనా?
తెలంగాణ అసెంబ్లీకి మరి కొన్ని నెలల్లో ఎన్నికల జరగబోతున్నాయి. అందుకే మొదటిగా ప్రియాంక ఈ రాష్ట్రానికి సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరిస్తారని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెబుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ఇకపై ప్రియాంకా గాంధీ చూడబోతున్నారా? రాహుల్ గాంధీ పూర్తిగా ఉత్తరాదిపై ఫోకస్ చేయనున్నారా? అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకకు ఇకపై ప్రియాంకా గాంధీ అనధికార ఇంచార్జిగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు యూపీతో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాలు చక్కబెట్టిన ప్రియాంకా గాంధీ.. ఇకపై దక్షిణాదికి పరిమితం అవుతారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
తెలంగాణ అసెంబ్లీకి మరి కొన్ని నెలల్లో ఎన్నికల జరగబోతున్నాయి. అందుకే మొదటిగా ఆమె ఈ రాష్ట్రానికి సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరిస్తారని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెబుతున్నారు. గతంలోనే ఆమెను తెలంగాణ ఇంచార్జిగా చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో ఆమె తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశాలు కూడా నిర్వహించారు. కానీ పూర్తి స్థాయి బాధ్యతలు మాత్రం తీసుకోలేదు.
అయితే ఈ సారి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ప్రియాంకా గాంధీకి ఇస్తారని మరోసారి ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే ఆమె ఈ నెల 8న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రియాంకా ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలను పరిష్కరించడమే మొదటి టాస్క్ అవుతుందని కూడా చెబుతున్నాయి. అయితే ఎన్నాళ్లగానో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీనియర్ల మధ్య ఉన్న గొడవలను ప్రియాంక తీరుస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్‌ను ఎదుర్కునే వ్యూహాలను రచించడంతో పాటు.. దూకుడుగా ఉన్న బీజేపీని కూడా కట్టడి చేయాల్సి ఉన్నది. కాంగ్రెస్ నాయకులందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి.. బీఆర్ఎస్, బీజేపీని ఎదుర్కునేలా పార్టీని సంసిద్దం చేయడం ప్రియాంక వల్ల అవుతుందా అనే చర్చ అప్పుడే మొదలైంది. కేవలం నెలల వ్యవధిలో ఇవన్నీ పూర్తి చేసి.. ఎన్నికలకు పార్టీని నడిపించడం క్లిష్టమైన పనే. గతంలో యూపీ బాధ్యతలను అప్పగించిన సమయంలో ప్రియాంకపై పెద్ద భారమే పెట్టారు. పార్టీని గాడిలో పెట్టి.. ఎన్నికల్లో విజయం కోసం చాలా కృషి చేసినా.. ఆమె పార్టీని గెలుపు బాట పట్టించలేక పోయారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏ మేరకు సిద్ధం చేస్తారో వేచి చూడాల్సిందే.