Telugu Global
Telangana

దక్షిణాది నుంచే ప్రియాంక పోటీ.. ఆ నియోజకవర్గంలో సర్వే.!

ఇందిరాగాంధీ సైతం కర్ణాటక నుంచి పోటీ చేశారు. 1978లో చిక్కమగళూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఈ స్థానంలో బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి శోభాకరంద్లాజే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

దక్షిణాది నుంచే ప్రియాంక పోటీ.. ఆ నియోజకవర్గంలో సర్వే.!
X

కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సైతం దక్షిణాది నుంచే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకతో పాటు తెలంగాణలోని ఓ సీటు నుంచి ప్రియాంక పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్‌ నాయకత్వానికి తెలియకుండానే ఇప్పటికే కొప్పల్ నియోజకవర్గంలో సర్వే కూడా పూర్తయిందని AICC వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలోని ఒక స్థానం నుంచి కూడా ప్రియాంకను నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

కర్ణాటకలోని కొప్పల్‌ అత్యంత వెనుకబడి జిల్లా. ఈ జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలు ఉండగా..ఆరు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కొప్పల్‌లో ఇప్పటికే సర్వే నిర్వహించిన AICC ప్రియాంకకు ఇదే సురక్షితమైన సీటుగా సూచించింది. ప్రస్తుతం కొప్పల్‌ నుంచి బీజేపీ ఎంపీ కరాడి సంగన్న ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

గతంలో ఇందిరాగాంధీ సైతం కర్ణాటక నుంచి పోటీ చేశారు. 1978లో చిక్కమగళూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఈ స్థానంలో బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి శోభాకరంద్లాజే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.1999 లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ సైతం బళ్లారి నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సుష్మా స్వరాజ్‌పై విజయం సాధించారు.

మరోవైపు ఇప్పటికే రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సారి కూడా రాహుల్‌ అమేథితో పాటు వయనాడ్‌ నుంచి పోటీ చేస్తారని సమాచారం. ఇక సోనియా గాంధీ గత ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే తెలంగాణలోని ఖమ్మం లేదా మరో స్థానం నుంచి సోనియాను పోటీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూపీలో బీజేపీ గతంలో కంటే మరింత బలపడడంతో కాంగ్రెస్ అధినాయకత్వం యూపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని సురక్షితమైన సీటులో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

First Published:  14 Jan 2024 9:54 AM IST
Next Story