నిర్మల్ జిల్లాలో మరో బస్సు బోల్తా – మహిళ మృతి.. 24 మందికి గాయాలు
మొత్తం 50 మంది బస్సులో ప్రయాణిస్తుండగా, వారిలో 25 మందికి గాయాలైనట్టు తెలిసింది. ఈ బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. మహబూబ్ ఘాట్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై బోల్తా పడింది.
నిర్మల్ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు గురువారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 50 మంది బస్సులో ప్రయాణిస్తుండగా, వారిలో 25 మందికి గాయాలైనట్టు తెలిసింది. ఈ బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. మహబూబ్ ఘాట్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై బోల్తా పడింది.
ప్రమాద సమాచారం అందుకున్న సారంగాపూర్ పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రయాణికులు మాట్లాడుతూ ఆదిలాబాద్‌లో బస్సు బయలుదేరినప్పటి నుంచే డ్రైవర్ బస్సును మితిమీరిన వేగంతో నడుపుతున్నాడని తెలిపారు. బస్సు బోల్తా పడిన వెంటనే డ్రైవర్ ప్రమాదస్థలి నుంచి పరారయ్యాడని పోలీసులు చెప్పారు.
బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆదిలాబాద్‌కు చెందిన ఫర్హాన బేగం అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో నిర్మల్ ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు అంబులెన్సులో ఆమెను హైదరాబాదుకు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.