నడిరోడ్డుపై తగలబడ్డ బస్సు.. ఒకరు సజీవ దహనం
హైదరాబాద్ నుంచి చీరాలకు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు రాత్రి బయలుదేరింది. నల్గొండ సమీపంలోని మర్రిగూడ బైపాస్ రోడ్ సెంటర్లోకి వచ్చేసరికి బస్సులో మంటలు చెలరేగాయి.
నల్గొండ వద్ద ఈరోజు తెల్లవారుఝామున ఘోరం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి బస్సులోనే సజీవ దహనం అయ్యాడు. అతడి ఎముకలు మాత్రమే బస్సులో మిగిలాయి. ఈ ఘటన చూసి పోలీసులే షాకయ్యారు. రోడ్డుపై బస్సు తగలబడిన సమయంలో అందులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు స్టాఫ్, ప్రయాణికులు అందరూ తప్పించుకోగా.. ఒక్కరు మాత్రం అగ్నికీలలకు బలయ్యారు. మిగతావారు ప్రాణాలతో బయటపడ్డారు. వారి లగేజీ, విలువైన వస్తువులు.. అన్నీ బస్సుతో సహా తగలబడ్డాయి.
హైదరాబాద్ నుంచి చీరాలకు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు రాత్రి బయలుదేరింది. నల్గొండ సమీపంలోని మర్రిగూడ బైపాస్ రోడ్ సెంటర్లోకి వచ్చేసరికి బస్సులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దూకేశారు. కొంతమంది హ్యాండ్ బ్యాగ్ లు, లగేజీ దించేసుకున్నారు. మిగతావారు ప్రాణాలు దక్కితే చాలనుకుని బయటకు వచ్చేశారు. క్షణాల్లోనే మంటలు బస్సంతా వ్యాపించాయి. నిద్రమత్తులో ఉన్న ఓ వ్యక్తి తేరుకుని బయటకు వచ్చేలోగా అతడికి మంటలు అంటుకున్నాయి. బస్సులోనే సజీవ దహనం అయ్యాడు.
ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 3 గంటల సేపు ప్రయాణికులు రోడ్డుపైనే నిలబడి ఉండాల్సి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా.. లేక డ్రైవర్, ట్రావెల్స్ యాజమాన్యాల తప్పిదం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
♦