Telugu Global
Telangana

యాదాద్రి నర్సింహ స్వామికి బంగారం కానుకగా ఇచ్చిన నిజాం ప్రిన్సెస్ ఇస్రా

నిజాం వంశంలో చివరి ప్రిన్స్ ముఖరంజా మాజీ భార్యనే ప్రిన్సెస్ ఇస్రా. ఆమె ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నా.. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్తుంటారు.

యాదాద్రి నర్సింహ స్వామికి బంగారం కానుకగా ఇచ్చిన నిజాం ప్రిన్సెస్ ఇస్రా
X

తెలంగాణ అంటే గంగా జమునా తెహజీబ్ అనే విషయం మరో సారి రుజువయ్యింది. నిజాం నవాబుల కుటుంబానికి చెందిన ప్రిన్సెస్ ఇస్రా.. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి బంగారాన్ని కానుకగా ఇచ్చారు. ఇటీవల యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రిన్సెస్ ఇస్రా రూ.5 లక్షలు విలువ చేసే ఆరున్నర తులాల (67 గ్రాములు) బంగారు ఆభరణాలను కానుకగా అందించారు. ఈ ఆభరణాలను యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ జీ. కృష్ణారావు.. ప్రిన్సెస్ తరపున ఆలయ ఈవో ఎన్. గీతకు అందించారు.

నిజాం వంశంలో చివరి ప్రిన్స్ ముఖరంజా మాజీ భార్యనే ప్రిన్సెస్ ఇస్రా. ఆమె ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నా.. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్తుంటారు. ఆమె టర్కీ రాజ కుటుంబానికి చెందిన రాకుమారి. గతంలోనే బ్రహ్మోత్సవాల సమయంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వస్తానని ఆమె మాట ఇచ్చారు. అయితే, గత నెలలో ముఖరంజా చనిపోవడంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. కానీ ఆమె ఇద్దామని అనుకున్న కానుకలను మాత్రం పంపించారు.

అసఫ్ జాహీల పరిపాలనలో చివరి నిజాం రాజైన మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా అప్పట్లో యాదగిరిగుట్ట గుడి కోసం రూ.82,825 గ్రాంట్‌ను విడుదల చేశారు. తెలంగాణలో అత్యధిక మంది.. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి చెందిన చాలా మంది యాదగిరిగుట్టను సందర్శించే వారు. దీంతో నిజాం నవాబులు కూడా ఈ దేవాలయం అభివృద్ధికి నిధులు కేటాయించారు.

టర్కీ రాజవంశానికి చెందిన ప్రిన్సెస్ ఇస్రాను ముఖరంజా 1959లో పెళ్లి చేసుకున్న తర్వాతే ఆమె నిజాం ప్రిన్సెస్ అయ్యింది. అయితే 15 ఏళ్ల కాపురం తర్వాత వారిద్దరూ విడిపోయారు. ప్రిన్స్ ముఖరంజా, ప్రిన్సెస్ ఇస్రాకు షేక్యా అనే కూతురు. అజ్‌మెత్ జా అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఇతనే నిజాం వంశానికి వారసుడుగా ఉన్నాడు. ప్రిన్సెస్ ఇస్రా మాత్రం లండన్‌లో స్థిరపడ్డారు. హైదరాబాద్‌లోని చౌమొహల్లా ప్యాలెస్, ఫలక్‌నూమా ప్యాలెస్‌లను ఇస్రా అభివృద్ధి చేశారు. ఇప్పటికీ అవి వారి వారసత్వ సంపదగా ఉన్నాయి.

హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న యాదాద్రి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేశారు. గతంలో గుట్టపై కేవలం 2 ఎకరాల విస్తీర్ణంలోనే ఆలయం ఉండేది. కానీ 2016లో ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 14 ఎకరాల్లో అత్యంత అద్బుతంగా ఆలయాన్ని నిర్మించారు. దీనిని 2022 మార్చి 28న సీఎం కేసీఆర్ తిరిగి ప్రారంభించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎడమ వైపున ప్రిన్సెస్ ఇస్రా


First Published:  27 Feb 2023 4:32 PM IST
Next Story