హైదరాబాద్‌లో మోడీ రోడ్ షో.. ఎప్పుడంటే..!
ఇటీవల ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ప్రధాన పార్టీలన్ని ప్రచారాన్ని ఉధృతం చేశాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పటికే బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీజేపీ మాత్రం ఢిల్లీ పెద్దలపైనే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులు రాష్ట్రానికి వస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.
ఈనెల చివరి వారంలో ప్రధాని మోడీ హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈనెల 25న కరీంనగర్‌లో బహిరంగసభ, 26న నిర్మల్‌లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలకు మోడీ హాజరవుతారు. చివరగా 27న హైదరాబాద్‌లో రోడ్ షోలో పాల్గొంటారని తెలుస్తోంది. మొత్తంగా ఈ నెలాఖరులో వరుసగా మూడు రోజులు ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ఇక ఇప్పటికే మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు ప్రధాని మోడీ. పసుపు బోర్డు, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చారు. నేడు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు హాజరుకానున్నారు మోడీ.