Telugu Global
Telangana

మేడారం జాతరపై ప్రధాని ఆసక్తికర ట్వీట్

భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. ఇవాళ సారలమ్మ గద్దె మీదకు రానున్నారు. గిరిజన పూజారులు కన్నెపల్లి నుంచి సారలమ్మను, పూనగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకురానున్నారు.

మేడారం జాతరపై ప్రధాని ఆసక్తికర ట్వీట్
X

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. "గిరిజనుల అతిపెద్ద పండుగల్లో మేడారం జాతర ఒకటి. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారలమ్మలకు ప్రణమిల్లుదాం. వారి ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం. మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు" అంటూ మోడీ ట్వీట్ చేశారు.


భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. ఇవాళ సారలమ్మ గద్దె మీదకు రానున్నారు. గిరిజన పూజారులు కన్నెపల్లి నుంచి సారలమ్మను, పూనగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకురానున్నారు. బుధవారం, గురువారం కూడా భారీగా భక్తులు తరలొచ్చే అవకాశం ఉంది. మేడారానికి ఇప్పటికే 15 లక్షల మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి జాతరకు కోటిమందికి పైగా భక్తులు వస్తారని అంచనా. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

రవాణా పరంగానూ తెలంగాణ ఆర్టీసీ 6వేల స్పెషల్ బస్సులను నడుపుతోంది. మేడారం మహాజాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో 4 రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈనెల 21, 22, 23, 24 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కార్యాలయాలు పనిచేయవని తెలిపింది.

First Published:  21 Feb 2024 6:49 AM
Next Story