Telugu Global
Telangana

ఏప్రిల్ 8న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్‌లో పలు శంకుస్థాపనలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్దరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లో 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రారంభించనున్నారు.

ఏప్రిల్ 8న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్‌లో పలు శంకుస్థాపనలు
X

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న హైదరాబాద్‌ రానున్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య కొత్తగా వందే భారత్ రైలును ఆయన ప్రారంభించనున్నారు. ఇది ప్రయాణికులకు కమర్షియల్‌గా 9 నుంచి అందుబాటులో ఉండనున్నది. ఇప్పటికే ఈ వందే భారత్ రైలుకు సంబంధించిన షెడ్యూల్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో నడవనున్న రెండో వందే భారత్ రైలు ఇదే. ఈ ఏడాది జనవరి 19న సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య తొలి వందే భారత్ రైలును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. అప్పట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్నారు. కానీ ఈ సారి మాత్రం హైదరాబాద్ వచ్చి స్వయంగా వందే భారత్ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

ఇక అదే రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్దరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లో 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రారంభించనున్నారు. ఇది ఎంఎంటీఎస్ రెండో దశలో భాగమని రైల్వే అధికారులు అంటున్నారు.

ప్రధాని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే పబ్లిక్ ఫంక్షన్లో పాల్గొంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఏడు కొత్త రోడ్లు, అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే బీబీనగర్‌లోని ఎయిమస్‌కు సంబంధించిన హాస్పిటల్ బ్లాక్ రినోవేషన్ పనులకు కూడా ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. ఎయిమ్స్ క్యాంపస్‌లో కొత్త బిల్డింగ్ బ్లాక్ నిర్మాణం, ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించిన పనుల శంకుస్థాపన కూడా చేయనున్నారు.

కాగా, గత కొన్నాళ్లుగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రాజెక్టులు కేటాయించడం లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. రాష్ట్రానికి రావల్సిన ప్రాజెక్టులన్నీ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఎయిమ్స్‌కు నిధుల కేటాయింపు లేక మౌళిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ అన్యాయం చేస్తోందని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలు డిఫెండ్ చేయడానికి తెలంగాణ బీజేపీ నాయకులు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపనలు, వందే భారత్ పేరిట ప్రధాని మోడీని రాష్ట్రానికి రప్పిస్తున్నారని.. దీని వల్ల కాస్తైనా బీజేపీకి ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రధాని పర్యటన కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.


First Published:  2 April 2023 11:32 AM IST
Next Story