Telugu Global
Telangana

సామాన్యుల నడ్డి విరుస్తున్న ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాల్సిందే : మంత్రి కేటీఆర్

పెట్రో ధరల అంశంపై పార్లమెంటులో చర్చకు వచ్చే దమ్ము కేంద్రానికి లేదని, అసలు ఆ విషయమే మాట్లాడకుండా కుట్రలు పన్నుతోందని కేటీఆర్ అన్నారు.

సామాన్యుల నడ్డి విరుస్తున్న ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాల్సిందే : మంత్రి కేటీఆర్
X

దేశంలోని సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పెట్రో ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలను నిలువునా దోచుకుంటోందని ఆయన మండిపడ్డారు. ధరల పెంపుపై కేంద్రం చెప్పేవన్నీ అబద్దాలే అని, ఇన్నాళ్లు అంతర్జాతీయ ముడి చమురు ధరలను బూచిగా చూపిస్తూ చెప్పిన మాటలు కల్లబొల్లి కబుర్లే అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నానాటికీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.

పెట్రో ధరల అంశంపై పార్లమెంటులో చర్చకు వచ్చే దమ్ము కేంద్రానికి లేదని, అసలు ఆ విషయమే మాట్లాడకుండా కుట్రలు పన్నుతోందని కేటీఆర్ అన్నారు. పార్లమెంటులో చర్చించకపోయినా ప్రజలందరూ కేంద్రం చేస్తున్న పెట్రో దోపిడిని గమనిస్తున్నారు. కేంద్రమే దోపిడీదారు అవతారం ఎత్తి ప్రజల జేబుల్లోంచి డబ్బులు దోచుకుంటోందని దుయ్యబట్టారు. పెట్రో ధరల తాలూకు దుష్ఫరిమాణాలను మనం ప్రతీ రోజు అనుభవిస్తూనే ఉన్నామన్నారు. పెట్రో ధరలు తగ్గాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని వదిలించుకోవడమే ఏకైక మార్గమని మంత్రి చెప్పారు. ప్రజలు తప్పకుండా ఈ దోపిడీదారైన కేంద్ర ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ది చెప్పే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించారు.

అంతర్జాతీయ ధరలు దిగి వస్తున్నా.. ఆ ఫలాలు సామాన్యుడికి అందడం లేదు. 2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లుగా ఉంది. అప్పుడు పెట్రోల్ రేటు రూ.76 మాత్రమే. కానీ ఇవ్వాళ బ్యారెల్ ధర 66 డాలర్లకు తగ్గినా.. పెట్రోల్ ధర మాత్రం రూ.110గా ఉండటమే కేంద్ర ప్రభుత్వ దోపిడీకి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. దేశంలో పెట్రోలియం ధరల పెరుగుదలకు కారణం.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం కాదని.. మోడీనే ఈ ధరలను నిర్ణయించడం అని మండిపడ్డారు. తన కార్పొరేట్ మిత్రుల ఖజానాలు లాభాలతో నింపేందుకే పెట్రోల్ ధరలను అమాంతం పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు.

ఇన్నాళ్లూ ముడి చమురు ధరల గురించి చెప్పకుండా రష్యా-ఉక్రెయిన్ బూచి చూపించారు. అయితే రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకే ముడి చమురు మన దేశానికి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ఆలా తక్కువ ధరకు వచ్చే చమురు అందుబాటులో ఉన్నా.. ప్రజల జేబులకు చిల్లులు పడటం మాత్రం ఆగడం లేదు. దేశీయ వినియోగం పేరు చెప్పి దిగుమతి చేసుకుంటున్న రష్యా చమురును.. తిరిగి శుద్ధి చేసి విదేశాలకు అమ్మేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దాచిపెడుతోందని మండి పడ్డారు.

మరో వైపు విదేశాలకు అమ్ముతున్న కంపెనీలకు భారీ లాభాలు వస్తున్నాయి. కానీ, విండ్ ఫాల్ ట్యాన్స్‌ను తగ్గించి ఆ కార్పొరేట్ కంపెనీలకు లాభాలు మరింతగా పెంచుతున్నారు. దేశ ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నా.. పెట్రోలియం రేట్ల మాత్రం తగ్గించని కఠినాత్ముడు ప్రధాని మోడీ అని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం 2014 నుంచి ఒక్క రూపాయి కూడా వ్యాట్‌ను పెంచలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం సెస్సుల రూపంలో రూ.30 లక్షల కోట్లకు పైగా ప్రజల నుంచి కొల్లగొట్టింది. ఆ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైకి నెడుతోందని కేటీఆర్ చెప్పారు. జీఎస్టీ పరిధిలో ఉన్న వంట గ్యాస్ ధరను రూ.400 నుంచి రూ.1200కు పెంచిన అసమర్థ కేంద్ర ప్రభుత్వమని అన్నారు. జీఎస్టీ పరిధిలో ఉన్న గ్యాస్ ధరను ఎందుకు తగ్గించలేక పోయిందో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

పెట్రో ధరల భారం కారణంగా పేద, సామాన్య మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 45 శాతం మేర ధరలు పెంచారు. దీంతో రవాణా భారమై.. ప్రతీ సరుకు ధర పెరిగింది. నిత్యావసరాలు, కూరగాయలు అన్ని ధరలు పెరిగిపోయాయి. మరోవైపు పెట్రో ధరల పెరుగుదల కారణంగా ప్రజా రవాణా చార్జీలు కూడా పెంచాల్సి వస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం దేశాన్ని పట్టి పీడిస్తోందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.

First Published:  30 March 2023 5:16 PM IST
Next Story