ప్రధాని మోడీకే సీబీఐ మీద నమ్మకం లేదు.. ఇక దేశ ప్రజలెట్లా నమ్ముతారు : మంత్రి కేటీఆర్
ఆనాడు మోడీ చేసిన విమర్శలను తెలంగాణ మంత్రి కేటీఆర్ మళ్లీ రీట్వీట్ చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ.. ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా ఉపయోగిస్తున్నారో రోజూ చూస్తూనే ఉన్నాము. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇలా దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలను ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఒక వేళ సదరు నాయకులు బీజేపీలో చేరితే మాత్రం ఎలాంటి ఎంక్వైరీలు ఉండవు.. పైగా వారికి పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తోంది. అదే బీజేపీలో చేరకపోతే మాత్రం విచారణ పేరుతో భయపెడుతోంది. దేశంలో నిత్యం బీజేపీ, ప్రధాని మోడీ చేస్తున్న పని ఇదే.
ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇంతలా వాడుకుంటున్న ప్రధాని మోడీ.. ఒకానొక సమయంలో సీబీఐ విచారణపై నమ్మకం లేదని చెప్పారు. పదేళ్ల క్రితం గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో సీబీఐపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. సీబీఐ కాస్తా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిపోయిందని విమర్శలు చేశారు. దేశానికి సీబీఐపై నమ్మకం పోయిందని.. సీబీఐ అంటే కేంద్ర ప్రభుత్వానికి భయం కూడా లేదని ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఆనాడు మోడీ చేసిన విమర్శలను తెలంగాణ మంత్రి కేటీఆర్ మళ్లీ రీట్వీట్ చేశారు.
దేశానికి కేంద్ర దర్యాప్తు సంస్థలపై.. ముఖ్యంగా సీబీఐపై నమ్మకం కుదరడం లేదు. స్వయంగా దేశ ప్రధానికే సీబీఐపై నమ్మకం లేకపోతే.. ఇక ప్రజలెలా నమ్ముతారు అని ప్రశ్నించారు. ఈ ట్వీట్‌ను నెటిజన్లు, బీఆర్ఎస్ శ్రేణులు షేర్ చేస్తున్నాయి. అంతే కాకుండా గతంలో ప్రధాని మోడీ సీబీఐపై చేసిన ఆరోపణలను కూడా ఉటంకిస్తున్నారు. ఏదో ఒక రోజు ప్రధాని తప్పకుండా ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇలా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను ఇష్టానుసారం వాడుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీపై ఎలా విమర్శలు గుప్పించారో కూడా కామెంట్లు చేస్తున్నారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఒక మాట.. ప్రధానిగా మారిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని.. మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Why should the Nation NOT have faith in central agencies like CBI?
— KTR (@KTRBRS) March 23, 2023
Because the Hon’ble PM himself doesn’t !! https://t.co/Cs5eQIthlI