Telugu Global
Telangana

ఇవాళ రాష్ట్రానికి ప్రధాని మోడీ.. SC వర్గీకరణపై కీలక ప్రకటన.?

ఈ సభ తర్వాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే దానిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి- MRPS నిర్ణయం తీసుకోనుంది.

ఇవాళ రాష్ట్రానికి ప్రధాని మోడీ.. SC వర్గీకరణపై కీలక ప్రకటన.?
X

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని.. సభ అనంతరం తిరిగి 6 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.

ఈ సభలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి-MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొంటారు. సమగ్ర న్యాయనికి నాంది దండోరా-చలో హైదరాబాద్ నినాదంతో.. SC రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కోరుతూ MRPS, MSF, ఇతర దళిత సంఘాలు ఈ విశ్వరూప సభను నిర్వహిస్తున్నాయి. ఈ సభలో ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేస్తారని అంతా భావిస్తున్నారు.

ప్రధాని మోడీ రాక, MRPS సభ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. పంజాగుట్ట నుంచి బేగంపేట మీదుగా సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని సూచించారు. పరేడ్ గ్రౌండ్ చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో అన్ని జంక్షన్‌లలో ట్రాఫిక్‌ ఉంటుందని అంచనా వేసిన పోలీసులు.. జూబ్లి బస్‌స్టేషన్‌, రైల్వే స్టేషన్‌ వెళ్లే ప్రయాణికులు కాస్త ముందుగా బయల్దేరాలని.. మెట్రో సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు.

ఇక ఈ సభ తర్వాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే దానిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి- MRPS నిర్ణయం తీసుకోనుంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 46 లక్షల మంది మాదిగలు, 21 లక్షల మంది మాలలు ఉన్నారని MRPS చెప్తోంది. ఇక తుంగతుర్తిలో 65 వేల మంది, మధిరలో 45 వేల మంది, అలంపూర్‌లో 42 వేల మంది, స్టేషన్‌ ఘన్‌పూర్‌, అచ్చంపేట్‌లో 38 వేల మంది, సత్తుపల్లిలో 40 వేల మంది, చొప్పదండిలో 36 వేల మంది మాదిగ ఓటర్లు ఉన్నారని స్పష్టం చేసింది. పరకాల, గద్వాల నియోజకవర్గాల్లోనూ 30-35 వేల మంది మాదిగలు ఉన్నారని స్పష్టం చేసింది MRPS. ఆయా నియోజకవర్గాల్లో ఫలితాన్ని శాసించగల సత్తా మాదిగలకు ఉందని MRPS చెప్తోంది.

మెజార్టీ రిజర్వేషన్ల ఫలితాలు మాలలే అనుభవిస్తున్నారన్న కారణంతో ఎస్సీ వర్గీకరణ కోసం 1994 నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాడుతోంది. చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఉన్న టైంలో ఎస్సీలను A,B,C,D వర్గాలుగా వర్గీకరిస్తూ ప్రకటన చేశారు. అయితే ఆ నిర్ణయాన్ని 2004లో సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. అప్పటి నుంచి MRPS SC వర్గీకరణ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎస్సీ వర్గీకరణ జరిగితే విద్య, ఉద్యోగాల్లో మాదిగలకు మరిన్ని అవకాశాలు దక్కుతాయని చెప్తోంది.

First Published:  11 Nov 2023 2:40 AM GMT
Next Story