ఈ నెల 30న తెలంగాణకు రానున్న ప్రధాని మోడీ?
ఢిల్లీలోని పెద్దలతో ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోసం బీజేపీ రాష్ట్ర నాయకులు సంప్రదించినట్లు తెలుస్తున్నది.
తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారానికి తెరలేపాయి. సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకొని వస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల సరూర్‌నగర్‌లో భారీ సభ నిర్వహించింది. ఈ నెలాఖరు లోగా ఖమ్మంలో మరో సభకు ప్లాన్ చేసింది. అయితే తెలంగాణలో అధికారం కోసం ఆరాటపడుతున్న ఈ విషయంలో కాస్త వెనుకబడినట్లు కనపడుతోంది.
హోం మంత్రి అమిత్ షా చేవెళ్లలో భారీ సభ నిర్వహించినా.. దానికి ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇటీవల కాలంలో బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో బాగానే పర్యటిస్తున్నారు. కానీ బీజేపీ శ్రేణుల్లో అనుకున్నంత జోష్ రావడం లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ క్యాడర్ కూడా డీలా పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో ఒక భారీ బహిరంగ నిర్వహిస్తే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకొని రావచ్చని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని పెద్దలతో ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోసం బీజేపీ రాష్ట్ర నాయకులు సంప్రదించినట్లు తెలుస్తున్నది.
ప్రధాని మోడీ కనుక అపాయింట్‌మెంట్ ఇస్తే ఈ నెల 30న మల్కాజిగిరిలో భారీ బహిరంగ నిర్వహించాలని భావిస్తున్నది. మోడీ అపాయింట్‌మెంట్ దొరకడం దాదాపు ఖాయమే అని రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్లు తెలుస్తున్నది. ఈ నెల 10లోగా సభకు సంబంధించిన నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు అమిత్ షా ఈ నెల 15న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతున్నారు. 25న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్‌కర్నూల్ పట్టణంలో జరిగే సభకు హాజరవుతారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆ రెండు సభలకు కొనసాగింపుగా ప్రధాని మోడీ సభ నిర్వహించడం ద్వారా తెలంగాణలో క్యాడర్ తిరిగి ఎన్నికల మూడ్‌లోకి వస్తారని భావిస్తున్నారు.