Telugu Global
Telangana

పాలమూరు ఎత్తిపోతల డ్రై రన్‌కు రంగం సిద్ధం.. చురుకుగా సబ్‌స్టేషన్ పనులు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొత్తం, రంగారెడ్డి జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందించనున్నారు.

పాలమూరు ఎత్తిపోతల డ్రై రన్‌కు రంగం సిద్ధం.. చురుకుగా సబ్‌స్టేషన్ పనులు
X

దక్షిణ తెలంగాణకు సాగు, తాగు నీటిని అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిని పూర్తి చేయడంతో పాటు.. డ్రై రన్ చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్-1 పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఇక్కడ నీటిని ఎత్తి పోసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొత్తం, రంగారెడ్డి జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.35 వేల కోట్లుగా ఉన్నది. 2015లో తెలంగాణ సర్కారు ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. తొలి దశలో తాగునీరు, తర్వాతి దశలో సాగు నీటికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇన్నాళ్లు పర్యావరణ అనుమతులతో పాటు కొన్ని కోర్టు కేసులు ఉండటంతో పనులు నత్తనడకన సాగాయి. కానీ ఇప్పుడు ఆటంకాలు వీడిపోవడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డ్రై రన్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ పంపులను ఇప్పటికే అమర్చారు. పంప్ హౌస్‌లకు సంబంధించిన ఎలక్ట్రో మెకానికల్ సామాగ్రి పని తీరును పరిశీలిస్తున్నారు. నార్లాపూర్ సమీపంలోని 400 కేవీ సబ్ స్టేషన్లకు సంబంధించిన ట్రాన్స్ మిషన్ పనులు పూర్తయ్యాయి. ఇక ప్రస్తుతం రీచార్జి ప్రక్రియ కొనసాగుతోంది.

నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి చివరి వరకు మొత్తం 21 ప్యాకేజీలుగా ప్రాజెక్టు పనులను విభజించారు. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా.. 18 ప్యాకేజీ పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. దీనికి సంబంధించి అప్రోచ్ చానల్స్, పంప్ హౌస్‌లు, సర్జ్‌పూల్‌లు, ఓపెన్ కాలువలు (50 కిలోమీటర్లు), సొరంగాలు (62.2 కిలోమీటర్లు), కాలువల నిర్మాణం, మూడు 400/11 కేవీ సబ్‌స్టేషన్ల పనులు పూర్తయ్యాయి. ఇక త్వరలోనే డ్రై రన్, ఇతర టెస్టింగ్ పనులు పూర్తవుతాయని నాగర్‌కర్నూల్ చీఫ్ ఇంజనీర్ హమీద్ ఖాన్ తెలిపారు. ప్రాజెక్టు కింద ఉన్న నార్లాపూర్, వీరాంజనేయ, ఏదుల, వెంకటాద్రి, కురుమూర్తిరాయ, ఉద్ధండాపూర్ రిజర్వాయర్ల పనులు కూడా పూర్తయినట్లు ఆయన చెప్పారు.

First Published:  12 Aug 2023 7:42 AM IST
Next Story