Telugu Global
Telangana

అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్య పరిస్థితి.. హెల్త్ బులెటిన్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు నిపుణులైన వైద్య బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్య పరిస్థితి.. హెల్త్ బులెటిన్ విడుదల
X

కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు నిమ్స్ వైద్యులు ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రీతికి ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు నిపుణులైన వైద్య బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

వరంగల్‌లోని కేఎంసీకి చెందిన పీజీ విద్యార్థిని ప్రీతి విషపూరిత ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యాప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం ఆమెను వెంటనే వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. తెలంగాణ ప్రభుత్వం ఆమె విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. రెండు రోజుల క్రితం తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కూడా నిమ్స్‌కు వెళ్లి వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ప్రీతి కుటుంబ సభ్యులను ఓదార్చి.. తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

మరోవైపు ప్రీతి గతంలో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ బయటకు వచ్చాయి. కాలేజీలోని సైఫ్ అనే సీనియర్ విద్యార్థి తనను వేధిస్తున్నట్లు ఆ కాల్‌లో పేర్కొన్నది. తననే కాకుండా చాలా మంది జూనియర్లకు ఈ వేధింపులు తప్పడం లేదని చెప్పుకొచ్చింది. తాను సైఫ్‌పై ఫిర్యాదు చేయలేనని.. అలా చేస్తే సీనియర్లందరూ ఒకటై.. తనను మరింతగా వేధిస్తారని తల్లితో చెప్పుకున్నది.

కాగా, పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ శనివారం తెలిపారు. నలుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ ఇచ్చిన శాఖాపరమైన నివేదికలో సైతం నిందితుడిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు సైఫ్‌పై ర్యాగింగ్, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. సైఫ్‌కు కనుక శిక్ష ఖరారు అయితే అతడి పీజీ అడ్మిషన్‌ను రద్దు చేయనున్నట్లు కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ పేర్కొన్నారు.

First Published:  26 Feb 2023 1:26 PM IST
Next Story