Telugu Global
Telangana

జోకర్ నాయకుడైతే, మనం చూసేది సర్కస్ మాత్రమే

శరీరానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే కొన్నాళ్లకు తగ్గిపోతాయని, కానీ దేశానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే తగ్గవని చెప్పారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం మన దేశం అలాంటి పరిస్థితుల్లోనే ఉందని అన్నారాయన.

జోకర్ నాయకుడైతే, మనం చూసేది సర్కస్ మాత్రమే
X

జోకర్ ని నాయకుడిని చేస్తే.. మనం చూసేది ఇలాంటి సర్కస్ మాత్రమేనని అన్నారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మౌనంగా ఉంటే గాయాలు తగ్గవని చెప్పారు. హైదరాబాద్‎ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘సమూహ’ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆవిర్భావ సభను ఆయన ప్రారంభించారు. కవులు, రచయితలతో కలిసి ‘సమూహ’ లోగోను ఆవిష్కరించారు.

లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం రచయితలు అందరూ సంఘటితమై ఈ 'సమూహ' ఏర్పాటు చేశారని చెప్పారు ప్రకాష్ రాజ్. ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచయితలందరి ఉమ్మడి స్వరం, సహనశీలతను పాటిస్తూ మతోన్మాదాన్ని ధిక్కరించే సాహిత్యకారులు, సాంస్కృతిక కార్యకర్తల ఉమ్మడి వేదిక ఈ సమూహ అని అన్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మూడు నెలల నుంచి జాతుల వైరంతో రగిలిపోతోందని, సమస్యకు పరిష్కారం చూపాల్సిన పార్లమెంట్ రాజకీయాలకు వేదిక అయిందని, కొంతమంది మౌనం వహించారని అన్నారు ప్రకాష్ రాజ్.

శరీరానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే కొన్నాళ్లకు తగ్గిపోతాయని, కానీ దేశానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే తగ్గవని చెప్పారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం మన దేశం అలాంటి పరిస్థితుల్లోనే ఉందని అన్నారాయన. సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ తాను ఊరికే కూర్చోలేనని చెప్పారు. మణిపూర్ రగిలిపోతుంటే పార్లమెంటులో సమస్య పరిష్కారంపై చర్చించాల్సింది పోయి, నాయకులు గొప్పలకు పోయారన్నారు. జోకర్ నాయకుడైతే మనం సర్కస్‌ చూడాల్సిందేనని వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్.

First Published:  12 Aug 2023 1:54 PM GMT
Next Story