బేగంపేట్ - పంజాగుట్ట క్యూలైన్.. ప్రజావాణిలో వినిపిస్తున్న సమస్యలేంటి?
ఉదయం 7 గంటల నుంచే పూలే భవన్‌కు జనం క్యూ కట్టారు. నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులు వినతులు స్వీకరిస్తుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి జనం నుంచి పెద్దఎత్తున స్పందన వస్తోంది. శుక్రవారం జ్యోతిరావు పూలే భవన్‌కు తమ సమస్యలు చెప్పుకునేందుకు జనం పెద్దసంఖ్యలో వచ్చారు. క్యూలైన్ ఏకంగా బేగంపేట్ నుంచి పంజాగుట్ట వరకు వెళ్లిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. జనాన్ని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో కాసేపు గందోరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అర్జీదారుల తాకిడితో అధికారులు కూడా కార్యాలయం లోపలికి వెళ్లలేక అక్కడే చిక్కుకుపోయారు.
ఉదయం 7 గంటల నుంచే పూలే భవన్‌కు జనం క్యూ కట్టారు. నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులు వినతులు స్వీకరిస్తుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమమే పెట్టినప్పటికీ ప్రజలు ఇంకా ఇక్కడికే వస్తున్నారు. జనం చెబుతున్న వాటిలో ఎక్కువగా భూ సమస్యలు, రేషన్ కార్డులు, పెన్షన్‌లు, డబుల్ బెడ్ రూం ఇళ్ల సమస్యలే అధికం.
ఈనెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. ఇటీవల ప్రజావాణిగా దీని పేరు మార్చారు. మొదట్లో శుక్రవారం మాత్రమే వినతులు స్వీకరిస్తామని చెప్పినా జనం రద్దీ ఎక్కువగా ఉండటంతో మంగళవారం కూడా అర్జీలు తీసుకుంటున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహిస్తున్నారు. జనం ఇస్తున్న వినతులను ఉన్నతాధికారులకు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు అధికారులు.