డిప్యూటీ సీఎం, 12వేల ఉద్యోగాలు.. జగ్గారెడ్డికి బంపర్ ఆఫర్!
సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డికి పొలిటికల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఆఫర్ వచ్చింది. కాకపోతే అది ఇచ్చింది బీజేపీనో, బీఆర్ఎస్సో కాదు..
సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సొంత పార్టీ కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీ మారతారని కాంగ్రెస్‌లోనే గట్టిగా ప్రచారం జరుగుతోంది. అయితే తనను కాంగ్రెస్‌కు దూరం చేయాలనే ఇలా పార్టీలో వారే దుష్ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి మంచి కాక మీదున్నారు. తాను కాంగ్రెస్‌లో ఉండొద్దా అంటూ నిన్న గట్టిగా నిలదీస్తూ మాట్లాడారు కూడా. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డికి పొలిటికల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఆఫర్ వచ్చింది. కాకపోతే అది ఇచ్చింది బీజేపీనో, బీఆర్ఎస్సో కాదు.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
నీకు పదవి.. నీ నియోజకవర్గానికి వేల కొలువులు
జగ్గారెడ్డి ప్రజాశాంతి పార్టీలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని కేఏ పాల్ ప్రకటించారు. అంతేకాదు సంగారెడ్డిలో యువతకు 12వేల ఉద్యోగాలిచ్చేలా పరిశ్రమలు పెట్టిస్తానని మరో భారీ హామీ కూడా గుప్పించేశారు. ఈ ఆఫర్ భలే కామెడీగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. దీనిపై జగ్గారెడ్డి ఎలా రియాక్టవుతారో చూడాలని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
కుటుంబ పాలనకు చరమగీతం
కుటుంబ పాలనకు చరమగీతం పాడేద్దామని కేఏ పాల్ ఓ భారీ పిలుపు కూడా ఇచ్చేశారు. కేఏ పాల్ మాటలను తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎవరూ సీరియస్‌గా తీసుకునే పరిస్థితి లేకపోయినా ఆయన మాత్రం రాజకీయాలను సీరియస్‌గా ఫాలో కావడం, ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ ఇష్యూస్ మీద తన అభిప్రాయాలు చెప్పడం మాత్రం మెచ్చుకోదగిన విషయమే.