ముగిసిన ప్రజాపాలన గడువు.. ఆ స్కీమ్ కోసమే భారీగా దరఖాస్తులు.!
సోమవారం నుంచి ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే సంబంధిత సిబ్బందికి శిక్షణ పూర్తయింది.
తెలంగాణలో వివిధ పథకాల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమం ముగిసింది. డిసెంబర్ 27న ప్రారంభమైన ఈ కార్యక్రమం దాదాపు 8 రోజుల పాటు కొనసాగింది. డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీన ఎలాంటి దరఖాస్తులు స్వీకరించలేదు. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజా పాలన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.
శుక్రవారం నాటికే ప్రజా పాలన కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తుల సంఖ్య కోటి 8 లక్షలు దాటింది. చివరి రోజు మరో 10 లక్షల దరఖాస్తులు వచ్చి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా దరఖాస్తుల సంఖ్య కోటి 15 లక్షల దరఖాస్తులు దాటుతుందని అధికారులు చెప్తున్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. GHMC పరిధిలో పెద్ద ఎత్తున దరఖాస్తులు దాఖలయ్యాయి. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హుల నుంచి అప్లికేషన్లు స్వీకరించారు.
ఇక సోమవారం నుంచి ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే సంబంధిత సిబ్బందికి శిక్షణ పూర్తయింది. ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎస్ ఇప్పటికే ఆదేశించారు. మండల స్థాయిలోనూ డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగనుంది. డేటా ఎంట్రీకి దాదాపు 10 రోజుల సమయం పట్టనుంది. డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక జరగనుంది.