ప్రగతి భవన్.. ప్రజాభవన్.. భట్టి భవన్ - సోషల్‌మీడియాలో సెటైర్లు
ప్రజాదర్బార్ పేరును ప్రజావాణిగా మార్చిన రేవంత్ సర్కార్.. ఆ కార్యక్రమాన్ని వారంలో రెండు రోజులకు కుదించింది. ఇకపై మంగళవారం, శుక్రవారం మాత్రమే ప్రజావాణి నిర్వహించనున్నారు.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతిభవన్‌ను, ప్రస్తుత ప్రభుత్వం జ్యోతిబా పూలే ప్రజా భవన్‌గా మార్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ భవనాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు సైతం జారీ చేశారు.
కేసీఆర్ ప్రగతిభవన్‌ను గడీలా మార్చుకున్నారని.. సామాన్యులకు అందులో ప్రవేశం లేదంటూ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‌ను ప్రజా భవన్‌గా మారుస్తామంటూ హామీ ఇచ్చారు. అందులో సామాన్యులకు ఆహ్వానం పలికి ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ముందు ఏర్పాటు చేసిన కంచెను తొలగించింది రేవంత్ సర్కార్. మంత్రులతో కలిసి ప్రజా దర్బార్ సైతం నిర్వహించారు రేవంత్. అయితే ఉన్నట్టుండి ప్రజాదర్బార్ పేరును ప్రజావాణిగా మార్చిన రేవంత్ సర్కార్.. ఆ కార్యక్రమాన్ని వారంలో రెండు రోజులకు కుదించింది. ఇకపై మంగళవారం, శుక్రవారం మాత్రమే ప్రజావాణి నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ప్రజాభవన్ రెండు రోజుల మురిపెంగా మారిందని.. కాంగ్రెస్‌వి కేవలం మాటలేనంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రగతిభవన్ కాస్త ప్రజా భవన్.. తర్వాత రెండు రోజులకే భట్టి భవన్ మారిందంటూ ట్రోల్ చేస్తున్నారు.