వేములవాడ, సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ లకు కరెంటు కట్..
హైదరాబాద్ లో మరమ్మతులకోసమే కోతలంటూ కాంగ్రెస్ కవర్ చేస్తున్నా.. కరెంటు కష్టాలు కాంగ్రెస్ తో మొదలయ్యాయని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా మున్సిపాల్టీ కార్యాలయాలకు కరెంటు కట్ చేయడం మరింత సంచలనంగా మారింది.
తెలంగాణలో కరెంటు సరఫరా విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విద్యుత్ రంగంపై అసెంబ్లీలో పై శ్వేతపత్రం విడుదల చేసినప్పటినుంచి ఈ వ్యవహారం మరింత ముదిరింది. విద్యుత్ రంగంలో సంస్కరణలు చేసి 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేశామని బీఆర్ఎస్ చెబుతుంటే.. ఆ రంగాన్ని నాశనం చేశారని, ఆర్థికంగా నష్టాలపాలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ లో కరెంటు కోతలు కూడా హైలైట్ అవుతున్నాయి. మరమ్మతులకోసమే కోతలంటూ కాంగ్రెస్ కవర్ చేస్తున్నా.. కరెంటు కష్టాలు కాంగ్రెస్ తో మొదలయ్యాయని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా మున్సిపాల్టీ కార్యాలయాలకు కరెంటు కట్ చేయడం మరింత సంచలనంగా మారింది.
టార్గెట్ సిరిసిల్ల..
కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి అధికారులు కరెంట్ కట్ చేశారు. మున్సిపల్ ఆఫీసుతో పాటు మున్సిపాల్టీకి సంబంధించిన దోభీ ఘాట్, మినీ స్టేడియం, వీధి లైట్లకు కూడా కరెంట్ సరఫరా నిలిపివేయడంతో కలకలం రేగింది. సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన వీధులన్నీ రాత్రి వేళ చీకటిమయం అయ్యాయి. గతేడాది నుంచి మున్సిపల్ ఆఫీసు రూ.1.56 కోట్ల బకాయిలు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న వేములవాడ మున్సిపాల్టీకి కూడా కరెంటు కట్ చేయడం విశేషం. వేములవాడ మున్సిపల్ కార్యాలయం రూ. 2.60 కోట్ల వరకు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు అధికారులు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా మున్సిపల్ అధికారులు స్పందించలేదని అందుకే కరెంటు కట్ చేశామని చెబుతున్నారు విద్యుత్ శాఖ అధికారులు. మున్సిపల్ కార్యాలయంలో లైట్లు, ఫ్యాన్లు లేకుండా సిబ్బంది అవస్థలు పడుతున్నారు.