సీమాంధ్ర సోదరులారా..! ఆలోచించండి
తొలి ప్రధాని నెహ్రూ నుంచి నేటి ప్రధాని వరకూ ఎవ్వరూ చెయ్యని ఓ గొప్ప పని మిషన్ భగీరథ అన్నారు పోసాని. తెలంగాణ నుంచి ఫ్లోరైడ్ సమస్యను పారదోలడం.. కేసీఆర్ ఒక్కరికే సాధ్యపడిందన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో కీలకంగా మారాయి. సహజంగా ఏపీతో సంబంధాలున్న పార్టీకి ఆ ఓట్లు పడే ఆనవాయితీ ఉంది. ఏపీ నుంచి వైసీపీ, టీడీపీ రెండూ ఇక్కడ పోటీలో లేవు. జనసేన కొన్నిచోట్ల పోటీ చేస్తున్నా.. ఆ పార్టీకి ఏపీలోనే ఓట్లు లేవు కాబట్టి.. సెటిలర్ల ఓట్లు గుంపగుత్తగా పడతాయనే నమ్మకం లేదు. బీజేపీ, కాంగ్రెస్ కి సెటిలర్లు మద్దతు తెలిపే అవకాశాలు చాలా తక్కువ. ఈ దశలో కొన్నాళ్లుగా సెటిలర్ల ఓట్లు బీఆర్ఎస్ కే పడుతున్నాయి. 2023అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సెటిలర్లు బీఆర్ఎస్ కే మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి.
న్యూయార్క్ ని తలదన్నేలా హైదరాబాద్..
సీమాంధ్ర సోదరులను కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకున్నారని అందుకే ఓటు వేసేముందు సీమాంధ్రులు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు పోసాని. తెలంగాణ వస్తే ఏదేదో జరిగిపోతుందని గత పాలకులు సీమాంధ్రులను భయభ్రాంతులకు గురిచేశారని, కానీ ఈ పదేళ్లలో అలాంటి ఘటన ఏదైనా జరిగిందా? అని ప్రశ్నించారు. అన్నదమ్ముల్లా అందరూ ప్రశాంతంగా ఉన్నారని, గతంలో కంటే ఉపాధి అవకాశాలు పెరిగాయని, వ్యాపారాలు చక్కగా సాగుతున్నాయని చెప్పారు పోసాని. దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకొనేలా హైదరాబాద్ ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని కితాబిచ్చారు. విశాలమైన రోడ్లు, ఫ్లై ఓవర్లు, మెట్రో, ఐటీ పరిశ్రమలతో హైదరాబాద్ అలరారుతోందన్నారు. న్యూయార్క్ ను తలదన్నేలా హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు పోసాని.
తొలి ప్రధాని నెహ్రూ నుంచి నేటి ప్రధాని వరకూ ఎవ్వరూ చెయ్యని ఓ గొప్ప పని మిషన్ భగీరథ అన్నారు పోసాని. తెలంగాణ నుంచి ఫ్లోరైడ్ సమస్యను పారదోలడం.. కేసీఆర్ ఒక్కరికే సాధ్యపడిందన్నారు. ఇక కాళేశ్వరంపై వచ్చిన ఆరోపణలపై కూడా పోసాని తనదైన శైలిలో స్పందించారు. మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించిన ఒక పిల్లర్ కుంగిపోతే ఊళ్లు ఎలా మునిగిపోతాయని ప్రశ్నించారు. సమస్య ఉంటే అది ఇంజినీరింగ్ లోపంగా చూడాలని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో బ్రిడ్జిలే కూలిపోతున్నాయని, అక్కడి సీఎంలను జైలులో పెట్టారా అని ప్రశ్నించారు. ఏపీలో పోలవరం కట్టడానికి ముఖ్యమంత్రులే మారిపోయారన్నారు పోసాని. సీఎం కేసీఆర్ చావు అంచుల వరకు వెళ్లి తెలంగాణ సాధించారని, కాంగ్రెస్ నాయకులు తెలంగాణపై చూపించేదంతా కపట ప్రేమ అని చెప్పారు పోసాని.