K Viswanath Passed Away: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కె.విశ్వనాథ్ కన్ను మూత!
K Viswanath Passed Away: గుంటూరు జిల్లా రేపల్లెలో 1930 ఫిబ్రవరి 19న కే విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. డిగ్రీ తర్వాత మద్రాసులోని వాహిని స్టూడియోస్‌లో సౌండ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు.
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కె.విశ్వనాథ్ కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్దరాత్రి మరణించారు.
గుంటూరు జిల్లా రేపల్లెలో 1930 ఫిబ్రవరి 19న కే విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. డిగ్రీ తర్వాత మద్రాసులోని వాహిని స్టూడియోస్‌లో సౌండ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు. 1965లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టారు.
50 సినిమాలకు పైగా ఆయన దర్శకత్వం వహించారు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన చివరి సినిమా శుభప్రదం.
విశ్వనాథ్ 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం , పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 2016 లో ఆయన సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెన్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
దర్శకుడిగానే కాక ఆయన నటుడిగా కూడా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. శుభసంకల్పం సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన కె.విశ్వనాథ్.. వజ్రం, కలిసుందాంరా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వు లేక నేను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్ వంటి పలు సినిమాల్లో నటించారు.