కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. గాంధీభవన్ వద్ద పొన్నాల రచ్చ
ఏఐసీసీ ఓటింగ్ కార్డులు ఇచ్చిందని పొన్నాల చెబుతున్నా పోలింగ్ సిబ్బంది వినిపించుకోలేదు. ఏఐసీసీ ఓటర్ల జాబితాలో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పడంతో పొన్నాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం సహా.. అన్ని పీసీసీ కేంద్రాల్లో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. తెలంగాణకు సంబంధించిన పోలింగ్ స్టేషన్‌ను నాంపల్లిలోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేశారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో దానికి ఇద్దరు చొప్పున 238 మంది ఏఐసీసీ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే గాంధీభవన్ వద్దకు ఓటు హక్కు కలిగిన అందరూ చేరుకుంటున్నారు. తెలంగాణకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా పార్లమెంట్ సభ్యుడు రాజ్‌మోహన్ ఉన్నతన్ వ్యవహరిస్తున్నారు. ఆయనకు సహాయకుడిగా రాజ్ భగేల్ నియమించబడ్డారు.
ఇక అధ్యక్ష బరిలో ఉన్న మల్లిఖార్జున్ ఖర్గే తరపున పోలింగ్ ఏజెంట్లుగా మల్లు రవి, షబ్బీర్ అలీ.. శశిథరూర్ ఎన్నికల ఏజెంట్లుగా కుమ్మరి శ్రీకాంత్, సంతోశ్ కుమార్ రుద్ర వ్యవహరిస్తున్నారు. కాగా, ఉదయం పోలింగ్ ప్రారంభం అయిన కొంత సేపటికి జనగామ నియోజకవర్గ ప్రతినిధులుగా పొన్నాల లక్ష్మయ్య, శ్రీనివాసరెడ్డి గాంధీభవన్‌కు చేరుకున్నారు. అయితే పొన్నాలను అనుమతించిన పోలింగ్ సిబ్బంది.. శ్రీనివాసరెడ్డికి ఓటు హక్కు లేదని అడ్డుకున్నారు. ఇద్దరికీ ఏఐసీసీ ఓటింగ్ కార్డులు ఇచ్చిందని పొన్నాల చెబుతున్నా పోలింగ్ సిబ్బంది వినిపించుకోలేదు. ఏఐసీసీ ఓటర్ల జాబితాలో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పడంతో పొన్నాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాంధీభవన్ ఎదుట పోలింగ్ సిబ్బందిపై విరుచుకపడ్డారు. ఓటు హక్కు ఉన్నా సరే ఎందుకు శ్రీనివాస్‌ను అనుమతించరు. అసలు ఎవరు లిస్టును మార్చిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఆ ఓటును కొమ్మూరి ప్రతాపరెడ్డికి కేటాయించినట్లు గాంధీభవన్ పోలింగ్ సిబ్బంది చెప్పడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. శ్రీనివాసరెడ్డికి ఓటు హక్కు లేదని చెప్పడంతోనే కోపంతో ఉన్న పొన్నాలకు.. ఆ ఓటు కొమ్మూరికి కేటాయించారని తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. 45 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉంటున్న మనిషికి ఇది ఘోరమైన అవమానం అని ఆయన మండిపడుతున్న సమయంలో మీడియా కూడా అక్కడే ఉన్నది. వివాదం పెద్దగా అవుతుందని గ్రహించిన జానారెడ్డి ఆయనను అక్కడి నుంచి గాంధీ భవన్ లోపలికి తీసుకొని వెళ్లారు.
ఓటు పంచాయితీ తేలే వరకు తాను గాంధీభవన్ నుంచి వెళ్లనని మొండి పట్టు పట్టారు. ప్రస్తుతం గాంధీభవన్‌లోనే సీనియర్ నేతలు పొన్నాలతో మాట్లాడుతున్నారు. ఏఐసీసీ తుది జాబితాలో మార్పలు చేసిందని ఆయనకు నచ్చజెబుతున్నారు. అయితే, ఈ సమాచారం ముందు ఎందుకు ఇవ్వలేదని పొన్నాల ప్రశ్నించారు. రిటర్నింగ్ అధికారి కూడా తన వద్ద ఉన్న జాబితా ప్రకారమే ఓటు వేయడానికి అనుమతిస్తానని స్పష్టం చేశారు. దీంతో పొన్నాల ఏఐసీసీ కార్యాలయ సిబ్బందితో మాట్లాడినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతానికి ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉన్నది.