జనగామ సభలో పొన్నాల చేరిక.. బీఆర్ఎస్ లో ఆయన ఫ్యూచర్ ఏంటి..?
ఈరోజు జనగామ సభలో ఆయనకు కేసీఆర్, పార్టీ కండువా కప్పబోతున్నారు. సభలో పొన్నాల స్పీచ్ కూడా ఉంటుందని సమాచారం.
కాంగ్రెస్ కి రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య నేడు బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. జనగామలో జరిగే సభలో ఆయన గులాబి కండువా కప్పుకోబోతున్నారు. ఇప్పటికే కేటీఆర్, పొన్నాల ఇంటికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత పొన్నాల కుటుంబంతో సహా సీఎం కేసీఆర్ ని కలిశారు. ఈరోజు జనగామ సభలో ఆయనకు కేసీఆర్, పార్టీ కండువా కప్పబోతున్నారు. సభలో పొన్నాల స్పీచ్ కూడా ఉంటుందని సమాచారం.
బీఆర్ఎస్ కి లాభమేంటి..?
పొన్నాల చేరికతో బీఆర్ఎస్ కి బీసీ వర్గాలు మరింత దగ్గరయ్యే అవకాశముంది. ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి ఎక్స్ పెర్మెంట్ చేశారు. పల్లాకు ముత్తిరెడ్డి పూర్తి మద్దతు తెలిపినా కూడా పొన్నాల చేరికతో జనగామలో బీఆర్ఎస్ గెలుపు మరింత సులభం కాబోతోంది. కేవలం జనగామే కాకుండా.. చుట్టుపక్కల మరికొన్ని నియోజకవర్గాలను కూడా పొన్నాల ప్రభావితం చేస్తారు. సో.. బీసీ ఓట్లు, కాంగ్రెస్ ఓట్లు.. బీఆర్ఎస్ కు అదనంగా చేకూరే అవకాశముంది.
పొన్నాల సంగతేంటి..?
కాంగ్రెస్ లో టికెట్ దక్కదు అనుకున్న తర్వాతే పొన్నాల ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన సుదీర్ఘ అనుబంధాన్ని తెంపేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ తో ప్రయాణం మొదలు పెడుతున్నారు. ప్రస్తుతానికి అసెంబ్లీ టికెట్లు అన్నీ ఖరారు కావడంతో పొన్నాలకు అసెంబ్లీకి ఛాన్స్ లేదు. అయితే లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు బీఆర్ఎస్ అవకాశమిచ్చే ఛాన్స్ ఉంది. భువనగిరి పార్లమెంట్ నుంచి పొన్నాల బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. లేదా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. పొన్నాలకు తమ పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ఇప్పటికే మంత్రి కేటీఆర్ కూడా హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆయన స్థానం ఏంటనేది క్లారిటీ వస్తుంది.