కాంగ్రెస్ లో అవమానం, అవహేళన.. జనగామ సభలో పొన్నాల ఆవేదన
సీఎం కేసీఆర్ ప్రసంగం కంటే ముందు పొన్నాల లక్ష్మయ్య సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాలు, అవహేళనలు అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు.
45 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి.. ఇప్పుడు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు పొన్నాల లక్ష్మయ్య. జనగామ సభలో ఆయనకు సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పారు. బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ప్రసంగం కంటే ముందు పొన్నాల లక్ష్మయ్య సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాలు, అవహేళనలు అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తనకు నచ్చినట్టుగా నిర్ణయం తీసుకున్నానని, బీఆర్ఎస్ లో చేరానని చెప్పారు.
సీఎం కేసీఆర్ నిర్ణయాలు నచ్చి తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు చెప్పారు పొన్నాల లక్ష్మయ్య. అణగారిన వర్గాలు, బీసీలకు ఎన్నికల వేళ అన్ని పార్టీలు తాయిలాలు ఇవ్వాలని చూస్తుంటాయని, కానీ.. ఎన్నికలకు సంబంధం లేకుండా బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. అలాంటి కేసీఆర్ ని మూడోసారి కచ్చితంగా ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ తో కలసి వచ్చేటప్పుడు మల్లన్న సాగర్ ఎలా ఉందో చూశామని, 7 రిజర్వాయర్లు ఏర్పాటు చేశారని, చెరువుల్లో నీరు నింపి వ్యవసాయదారుల కన్నీరు తుడిచారని అన్నారు పొన్నాల లక్ష్మయ్య. కేసీఆర్ హయాంలో అభివృద్ధి ఓ ల్యాండ్ మార్క్ అయిందన్నారు. జనగామలో పాల ఉత్పత్తి మిగతా ప్రాంతాలకంటే ఎక్కువగా జరుగుతుందని.. ఇక్కడ డైరీని అభివృద్ధి చేశారని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు పొన్నాల. మరిన్ని అవకాశాలు సృష్టించి స్థానిక యువతకు ఉపాధి మార్గాలు చూపెట్టాలన్నారు.