Telugu Global
Telangana

హస్తం గూటికి పొంగులేటి, జూపల్లి.. ఈనెల 30న ముహూర్తం

బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన తర్వాత పొంగులేటి కాంగ్రెస్ లోకి, జూపల్లి బీజేపీలోకి వెళ్తారనే అంచనాలున్నాయి. అయితే అనూహ్యంగా జూపల్లి కూడా కాంగ్రెస్ కే జైకొట్టారు.

హస్తం గూటికి పొంగులేటి, జూపల్లి.. ఈనెల 30న ముహూర్తం
X

బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో వారిద్దరూ కాంగ్రెస్ కండువాలు కప్పుకోడానికి రెడీ అయ్యారు. ఈనెల 30న సరూర్ నగర్ లో నిర్వహించబోతున్న నిరుద్యోగ దీక్షకు ప్రియాంక గాంధీ హాజరు కావాల్సి ఉంది. ఆ కార్యక్రమంలోనే వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు.

రేణుకా చౌదరి, రేవంత్ రెడ్డి మంత్రాంగం..

జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికల విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరి మంత్రాంగం ఫలించింది. వారిద్దరితో చర్చలు పూర్తయ్యాక, ప్రియాంక గాంధీ సమక్షంలో కండువాలు కప్పుకునే ముహూర్తం ఖరారు చేశారు. ఎన్నికల సమయంలో అనుకోకుండా ఈ ఇద్దరి చేరికతో కాంగ్రెస్ కి కొత్త బలం వస్తుందని అంటున్నారు. ఇద్దరూ ఆర్థికంగా బలం ఉన్న నేతలు కావడంతో అధిష్టానం కూడా వారి చేరికలను సానుకూలంగా పరిగణిస్తోంది. ఇక ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ సీట్ల విషయంలో పొంగులేటి పెట్టిన కండిషన్లకు కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి పెత్తనం కోరుకుంటున్నారు. తనతోపాటు తన సన్నిహితుల టికెట్ల విషయంలో కూడా ఆయన కాంగ్రెస్ నుంచి గట్టి హామీ పొందారని తెలుస్తోంది.

బీజేపీకి ఛాన్స్ మిస్..

బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన తర్వాత పొంగులేటి కాంగ్రెస్ లోకి, జూపల్లి బీజేపీలోకి వెళ్తారనే అంచనాలున్నాయి. అయితే అనూహ్యంగా జూపల్లి కూడా కాంగ్రెస్ కే జైకొట్టారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది, అందరూ బీజేపీవైపే చూస్తున్నారంటూ డబ్బా కొట్టుకుంటున్న కమలదళానికి ఇది షాకింగ్ న్యూసేనని చెప్పాలి.

First Published:  20 April 2023 9:35 PM IST
Next Story