Telugu Global
Telangana

నత్తనడకన పోలింగ్.. హైదరాబాద్ లో మరీ దారుణం

నగర ఓటరు ఈ సారి కూడా బద్దకించాడు. మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్ లో అత్యల్పంగా 20.79శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది.

నత్తనడకన పోలింగ్.. హైదరాబాద్ లో మరీ దారుణం
X

వర్షం పడితే తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గుతుందనే అంచనాలున్నాయి. కానీ ఈసారి వర్షం పడకపోయినా ఓటు వేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 36.68శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం నుంచి మరింత మందకొడిగా పోలింగ్ కొనసాగుతోంది. ఇక చివరి గంటలో పోలింగ్ శాతం కాస్త పెరిగే అవకాశముంది.

హైదరాబాద్ లో దారుణం..

నగర ఓటరు ఈ సారి కూడా బద్దకించాడు. ఉదయాన్నే సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు వేసి ఇళ్లకు వెళ్లిపోగా.. సామాన్యులెవరూ పోలింగ్ బూత్ ల వైపు తొంగి చూడలేదు. అందరూ మీడియా, సోషల్ మీడియాతో బిజీగా ఉన్నారు కానీ.. ఓటింగ్ కి మాత్రం రావడంలేదు. హైదరాబాద్ లో అత్యల్పంగా 20.79శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది.

మెదక్ అత్యధికం..

మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా 36.68 శాతం మేర పోలింగ్‌ నమోదు కాగా.. అందులో అత్యధిక ఓటింగ్ మెదక్ లో జరిగింది. మెదక్ జిల్లాలో 50.8 శాతం పోలింగ్‌ నమోదైంది. గద్వాలలో 49.29, భూపాలపల్లిలో 49.12 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్‌లో 20.79 శాతం పోలింగ్‌ జరిగింది. రంగారెడ్డిలో 29.79 శాతం పోలింగ్ జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా అన్ని జిల్లాల్లో 40శాతం అటు ఇటుగా పోలింగ్ నమోదు కావడం విశేషం.

ఈ ఊపు చూస్తే ఫైనల్ రిజల్ట్ కూడా పెద్ద ఆశాజనకంగా ఉండదనిపిస్తోంది. పోలింగ్ శాతం పెరగాలంటే ఓటు హక్కు ఉన్న వారంతా ఓటింగ్ కి రావాలని పిలుపునిస్తున్నారు ఎన్నికల అధికారులు. ముఖ్యంగా అర్బన్ ఓటర్లు తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరుతున్నారు.

First Published:  30 Nov 2023 3:08 PM IST
Next Story