Telugu Global
Telangana

పోలింగ్‌కు వారమే.. పోల్‌ మేనేజ్‌మెంట్‌పై BRS ఫోకస్..!

పోల్‌ మేనేజ్‌మెంట్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది గులాబీ పార్టీ. ప్రతి నియోజకవర్గంలో గ్రామాలు, వార్డుల వారీగా ఓటర్లను ఐదు విభాగాలుగా గుర్తించి.. ఏయే వార్డుల్లో ఏ విభాగానికి చెందిన ఓట్లు ఎన్ని ఉన్నాయనే లిస్టును ఇప్పటికే పార్టీ రూపొందించింది.

పోలింగ్‌కు వారమే.. పోల్‌ మేనేజ్‌మెంట్‌పై BRS ఫోకస్..!
X

పోలింగ్‌కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో పార్టీ అభ్యర్థులను కేసీఆర్ అలర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజూ ఉదయాన్నే అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కేసీఆర్ నేరుగా ఫోన్‌లో మాట్లాడుతున్నారని సమాచారం. నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. తన దగ్గర ఉన్న తాజా సర్వే రిపోర్టు ఆధారంగా ఏయే అంశాల్లో మెరుగుపడాలనేదానిపై అభ్యర్థులకు సూచిస్తున్నట్లు సమాచారం. ఏ చిన్న అంశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదని అభ్యర్థులను అప్రమత్తం చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక పోల్‌ మేనేజ్‌మెంట్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది గులాబీ పార్టీ. ప్రతి నియోజకవర్గంలో గ్రామాలు, వార్డుల వారీగా ఓటర్లను ఐదు విభాగాలుగా గుర్తించి.. ఏయే వార్డుల్లో ఏ విభాగానికి చెందిన ఓట్లు ఎన్ని ఉన్నాయనే లిస్టును ఇప్పటికే పార్టీ రూపొందించింది. BRS అభిమానులు, పథకాల లబ్ధిదారులు కచ్చితంగా తమకే ఓటు వేస్తారనుకునే వారిని సానుకూల వర్గంగా.. పార్టీ అభిమానులై ఉండి, పథకాల ద్వారా లబ్ధిపొందినా.. ఇతర కారణాల వల్ల పార్టీ అభ్యర్థి పట్ల అసంతృప్తిగా ఉన్న వారిని రెండో వర్గంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ప్రతిపక్ష పార్టీ అభిమానులు, కార్యకర్తలను మూడో వర్గంగా.. ఏ పార్టీతోనూ సంబంధం లేకపోయినా ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్న వారిని నాలుగో వర్గంగా లిస్ట్‌ను రూపొందించార‌ని సమాచారం. ఇక తమ ఓటును ఎవరికి వేయాలో ఇంకా నిర్ణయం తీసుకోని తటస్థ ఓటర్లను ఐదో వర్గంగా విభజించారు. ఇందులో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నేతల వర్గాన్ని మిహాయించి.. మిగిలిన నాలుగు వర్గాల ఓటర్లను ఆకర్షించడంపై దృష్టిసారించినట్లు సమాచారం.

ప్రతి 100 ఓటర్లకు నలుగురు ఇన్‌ఛార్జులను నియమించింది బీఆర్ఎస్. ఆ నలుగురి ఓట్లు కచ్చితంగా ఆ 100 ఓట్ల పరిధిలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా ఆఖరి మూడు రోజుల్లో ఏం చేయాలో.. ఎప్పటికప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నట్లుగా సమాచారం.

First Published:  22 Nov 2023 8:16 AM IST
Next Story