గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ బూత్‌లు.. పోల్ పర్సంటేజ్ పెంచేందుకు ప్రయత్నాలు
ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1400 మంది మాత్రమే ఓటర్లుండాలని, ప్రతి రెండు కిలోమీటర్ల దూరానికి ఓ పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలనేది ఎన్నికల కమిషన్ రూల్.
ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ. పేద, ధనిక తేడా లేకుండా అందరూ ఓటేస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ. అదేం విచిత్రమో కానీ సామాన్యుల కంటే బాగా చదువుకున్నవాళ్లు, ధనవంతులే ఓటింగ్‌కు దూరంగా ఉండే పద్ధతి రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్, ముంబై లాంటి మహానగరాల్లో సగం మంది కూడా ఓటేయడానికి ముందుకురాని పరిస్థితి. దీనికి చెక్‌పెట్టడానికి సంపన్నులుండే గేటెడ్ కమ్యూనిటీల్లోనే ప్రత్యేకంగా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
ఒక్కో గేటెడ్ కమ్యూనిటీలో పోలింగ్ బూత్ స్థాయి ఓటర్లు
ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1400 మంది మాత్రమే ఓటర్లుండాలని, ప్రతి రెండు కిలోమీటర్ల దూరానికి ఓ పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలనేది ఎన్నికల కమిషన్ రూల్. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో ఒకోదానిలో దాదాపు 2వేల మంది వరకు ఓటర్లు ఉండటంతో అక్కడే స్పెషల్‌గా ఓ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తే.. దగ్గరలో ఉంటుంది కాబట్టి వచ్చి ఓటేస్తారని, దీంతో పోలింగ్ శాతం పెరుగుతుందని ఈసీ భావిస్తోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో 32 గేటెడ్ కమ్యూనిటీలు గుర్తింపు
హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలు 32 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో ఒక్కో గేటెడ్ కమ్యూనిటీలో రెండు వేలకు పైగా ఓటర్లు ఉండటంతో అక్కడే స్పెషల్‌గా పోలింగ్ కేంద్రం పెట్టాలని భావించారు. అయితే ఇప్పటికిప్పుడు దీని ఏర్పాట్లకు సమయం చాలదు. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికలకు కాకుండా త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఈ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.