Telugu Global
Telangana

మునుగోడు రాజకీయం.. కాంగ్రెస్ కి ప్రాణ సంకటం..

కాంగ్రెస్ సంప్రదాయ ఓటుబ్యాంక్ రాజగోపాల్ రెడ్డితోపాటు తరలి వస్తుందా లేదా అనేది అనుమానమే. ఓట్లు చీలేతే మాత్రం టీఆర్ఎస్ బ్రహ్మాండంగా లాభపడుతుంది.

మునుగోడు రాజకీయం.. కాంగ్రెస్ కి ప్రాణ సంకటం..
X

మునుగోడు అసెంబ్లీ సీటు కాంగ్రెస్ పార్టీది. కానీ అక్కడ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే గెలిచేది టీఆర్ఎస్సా, బీజేపీనా అనే పందెం నడుస్తోంది. అంటే కాంగ్రెస్ ని కనీసం లెక్కలోకి తీసుకోవడంలేదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా సాహసం చేసి, మునుగోడులో ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పరిస్థితి మరింత ప్రమాదంలో పడే అవకాశముంది. రాజగోపాల్ బీజేపీ టికెట్ పై గెలిచినా, లేదా టీఆర్ఎస్ ఆయన్ని ఓడించినా.. కాంగ్రెస్ కి మిగిలేదేమీ లేదు. పోనీ హుజూరాబాద్ లో లాగా బీజేపీ విజయంలో కాంగ్రెస్ ప్రతీకారం కూడా దాగుంది అనుకోడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. అక్కడ టీఆర్ఎస్ సీటుని బీజేపీ గెలుచుకుంది, ఇక్కడ కాంగ్రెస్ సీటు కోసం బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఆశ పడుతున్నాయి.

పిట్టపోరు పిట్టపోరు..

ప్రస్తుతం మునుగోడు విషయంలో ఇదే నిజమనిపిస్తోంది. పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా రాజగోపాల్ రెడ్డి వర్గం కాంగ్రెస్ నుంచి బయటకొస్తే.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్లు చీలి టీఆర్ఎస్ లాభపడేట్టుగా ఉంది. 2018 ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 97,239 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 74,687 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డికి కేవలం 12,725 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆరు శాతం ఓట్లతో ఉన్న బీజేపీ.. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఏకంగా విజయం సాధించాలనుకోవడం అత్యాశే. అయితే అక్కడ రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తే, ఆయన వర్గం కాంగ్రెస్ నుంచి బయటికొస్తుంది కాబట్టి.. బీజేపీకి ఓట్లు పడతాయని అంచనా. కాంగ్రెస్ సంప్రదాయ ఓటుబ్యాంక్ రాజగోపాల్ రెడ్డితోపాటు తరలి వస్తుందా లేదా అనేది అనుమానమే. ఓట్లు చీలేతే మాత్రం టీఆర్ఎస్ బ్రహ్మాండంగా లాభపడుతుంది.

2018లో 46 శాతం ఓట్లు సాధించిన రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ బ్రాండ్ లేకుండా అందులో ఎంత శాతం తనవైపు తిప్పుకోగలరనేదే ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. కనీసం అందులో సగానికి సగం ఓట్లు రాజగోపాల్ రెడ్డి సాధించినా దానివల్ల ఉపయోగం లేదు. ఆయనకు బీజేపీ ఓటు బ్యాంక్ ఎందుకూ పనికిరాదు. సరిగ్గా ఈ సిచ్యుయేషన్ ఉపయోగించుకుని మునుగోడు సీటుని కైవసం చేసుకోవాలనుకుంటోంది టీఆర్ఎస్.

అదృష్టం బాగుండి హుజూరాబాద్ లాంటి ఫలితం వస్తే ఓ సీటు అదనంగా దక్కించుకున్న సంతోషం బీజేపీకి మిగులుతుంది. బలమైన నాయకుడు కూడా పార్టీకి యాడ్ అయినట్టవుతుంది. పోనీ బీజేపీ ఓడిపోతే ఏమవుతుంది..? కాంగ్రెస్ సీటు టీఆర్ఎస్ ఖాతాలో పడుతుంది. బీజేపీకి ఓ బలమైన నాయకుడు మిగిలిపోతాడు. ఎలా చూసినా.. మునుగోడు ఉప ఎన్నిక అటు టీఆర్ఎస్ కి కానీ, ఇటు బీజేపీకి కానీ లాభదాయకంగా ఉంది కానీ, కాంగ్రెస్ అక్కడ ఆటలో అరటిపండే. ఉప ఎన్నికలే వస్తే కాంగ్రెస్ అక్కడ ఓట్లు అడిగేందుకు బలమైన కారణం కూడా లేదు. కేవలం రాజగోపాల్ రెడ్డి పార్టీని మోసం చేశారు, ఆయనకు బుద్ధి చెప్పాలంటే పార్టీని గెలిపించండి అని కోరాల్సిందే. టీఆర్ఎస్ మాత్రం అభివృద్ధి నినాదంతో వెళ్తుంది, బీజేపీ మార్పుకోసం ముందడుగు వేయండి అని అడుగుతుంది. సో.. ఎలా చూసుకున్నా.. మునుగోడుతో మునిగిపోయేది మాత్రం కాంగ్రెస్సే.

First Published:  31 July 2022 7:36 AM IST
Next Story