Telugu Global
Telangana

ఏపీ విభజనపై మళ్ళీ రాజకీయాలు... వేడెక్కుతున్న మాటల యుద్దం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ రోజు తెలుగు రాష్ట్రాల విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఏపీ, తెలంగాణలను కలిపి ఉమ్మడి రాష్ట్రం చేసేందుకు ఉన్న ఏ అవకాశాలను తాము వదులుకోబోమన్నారు. సజ్జల కామెంట్లు తెలంగాణలో వేడిని రగిలించాయి.

ఏపీ విభజనపై మళ్ళీ రాజకీయాలు... వేడెక్కుతున్న మాటల యుద్దం
X

60 ఏళ్ళ తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగాలు, కేసులు, జైళ్ళు, లాఠీ దెబ్బలు...అన్నీ భరించి సుదీర్ఘ కాలం కొట్లాడింది తెలంగాణ. చివరకు 2014 లో ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. 8 ఏళ్ళు గడిచిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఏ రాష్ట్రానికా రాష్ట్రం అభివృద్ది చెందేందుకు తమ తమ ప్రణాళికలతో ముందుకు పోతున్నాయి.

ఇలాంటి సమయంలో మళ్ళీ సమైక్య నినాదం ఎత్తుకుంటున్నారు ఏపీ నాయకులు. అది జరగదని తెలిసీ తమ రాజకీయ స్వార్దాల కోసం రెండు రాష్ట్రాలను కలుపుతామంటూ వాగ్దానాలు చేస్తున్నారు. దీనిపై ఇటు తెలంగాణలో నాయకులు విరుచుకపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ రోజు తెలుగు రాష్ట్రాల విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఏపీ, తెలంగాణలను కలిపి ఉమ్మడి రాష్ట్రం చేసేందుకు ఉన్న ఏ అవకాశాలను తాము వదులుకోబోమన్నారు. విభజన జరిగిన తీరే అప్రజాస్వామికంగా ఉందని, దీనిపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోందని, విభజన చట్టాన్ని రద్దు చేయడం కోసం తాము కోర్టులో పోరాడుతామని సజ్జల అన్నారు. మళ్లీ ఏపీని ఉమ్మడి రాష్ట్రం చేస్తే.. ముందుగా స్వాగతించేది వైసీపీయేనని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు టీడీపీతో సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపితే వ్యతిరేకంగా తొలి నుంచి పోరాటం చేసింది వైసీపీయేనని, ఉమ్మడి ఏపీగా కలిసి ఉండాలన్నదే ఇప్పటికీ తమ విధానమని చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముందని అన్నారు సజ్జల.

సజ్జల కామెంట్లు తెలంగాణలో వేడిని రగిలించాయి. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకులు భ‌ట్టి విక్రమార్క, పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ లు సజ్జలపై మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలకోసమే సజ్జల ఇలా మాట్లాడుతున్నారంటూ ద్వజమెత్తారు.

మళ్ళీ సెంటిమెంట్లు రగిల్చే కుట్రలో భాగంగానే సజ్జల ఇలాంటి వ్యాఖ్యలు చేశారని భ‌ట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు భట్టి. విభజన అన్నది అయిపోయిన అధ్యాయమని, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడటం అసాధ్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలు వింటూ ఉంటే మళ్ళీ తెలంగాణ పై దాడికి కుట్రపన్నారనే అనుమానాలు కలుగుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మళ్ళీ తెలంగాణలో రాజ్యాధికారం కోసం ఏపీ నాయకులు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

First Published:  8 Dec 2022 5:45 PM IST
Next Story