Telugu Global
Telangana

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. తెలంగాణలో టమాటా పాలిటిక్స్

టమాటా రేట్లు పెరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చివరకు ఇది పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది.

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. తెలంగాణలో టమాటా పాలిటిక్స్
X

హనుమకొండలోని తిరుమల జంక్షన్ లో టమాటాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్న వార్తలు విని జనం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. నిజంగానే అక్కడ టమాటాలు ఉచితంగా ఇస్తున్నారు, కేజీ చొప్పున టమాటాలు ప్యాక్ చేసి బండిపై పెట్టుకుని వెనక కాంగ్రెస్ నాయకులు నిలబడి ఉన్నారు. కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకున్నారు. గంటసేపు నాయకుల ప్రసంగం వింటేకానీ టమాటా ప్యాకెట్ చేతిలో పడలేదు. అది కూడా కొంతమంది కార్యకర్తలకే దొరికింది. ఆ మాత్రం దానికి టమాటాలు ఫ్రీ అంటూ హడావిడి చేయడమెందుకని సామాన్యులు విసుక్కున్నారు. కానీ ఉచిత టమాటాలతో స్థానిక కాంగ్రెస్ నాయకులకు కావాల్సినంత ఉచిత పబ్లిసిటీ లభించింది.

దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. సరైన సమయంలో పంట చేతికి రాకపోవడం, నిల్వలు లేకపోవడంతో అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేస్తూ రోడ్డెక్కారు. టమాటా రేట్లు తగ్గించాలని, అదే సమయంలో టమాటా రైతుల్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలంటూ ప్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేశారు.

పొలిటికల్ టమాటా..

టమాటా రేట్లు పెరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చివరకు ఇది పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. కొన్నిచోట్ల టమాటాలు సబ్సిడీపై పంపిణీ చేస్తూ ప్రభుత్వం మంచి మార్కులు కొట్టేయాలని చూస్తోంది. ఇంకొన్ని చోట్ల ప్రతిపక్షాలు టమాటా టాపిక్ ని హైలెట్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. సామాన్యులు మాత్రం టమాటా లేని కూరలకు అలవాటుపడుతున్నారు. అపురూపంగా వాటిని వాడుతున్నారు. మొత్తమ్మీద వంటింటిలో మంట పెట్టిన టమాటా, ఇటు పొలిటికల్ హీట్ కి కూడా కారణమైంది.

First Published:  10 July 2023 1:43 AM
Next Story