హైదరాబాద్ మెట్రో రైల్.. ఈ ఎన్నికల్లో మ్యాజిక్ చేస్తుందా?
తొలి మార్గంగా నాగోల్ నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల ట్రాక్ నిర్మించారు. 2017 నవంబర్ 28న హైదరాబాద్ మెట్రో రైల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించారు.
హైదరాబాద్ నగరాభివృద్ధిలో మెట్రో రైల్ ఓ మణిహారం. ట్రాఫిక్ ఇక్కట్లను తీర్చే లక్ష్యంతో ఆరేళ్ల కిందట దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి దశలవారీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఈ మెట్రో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. గెలిపిస్తే మీ నియోజకవర్గం వరకు మెట్రో రైల్‌ను విస్తరిస్తామంటూ ప్రధాన పార్టీలు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రకటిస్తుండటం విశేషం.
2017లో ప్రారంభం
తొలి మార్గంగా నాగోల్ నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల ట్రాక్ నిర్మించారు. 2017 నవంబర్ 28న హైదరాబాద్ మెట్రో రైల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించారు. మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు పీఎం మోడీ, కేటీఆర్ మెట్రో ట్రైన్‌లో కలిసి ప్రయాణించారు. తర్వాత మియాపూర్ -ఎల్బీనగర్, ఎంజీబీఎస్ - జేబీఎస్, అమీర్‌పేట - హైటెక్‌సిటీ రూట్లలోనూ మెట్రో అందుబాటులోకి వచ్చింది.
రోజూ దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు
ఈ మార్గాల్లో నిత్యం ప్రయాణికులతో మెట్రో ట్రైన్లు కిటకిటలాడతాయి. ప్రయాణ సమయం తక్కువ కావడం, కాలుష్య రహితంగా ఉండటంతో నగరవాసులు మెట్రోపై మోజు పడుతున్నారు. రోజూ దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. పాత బస్తీ వరకు మెట్రో ప్రతిపాదన ఇంకా అమల్లోకి రాలేదు. మరోవైపు ఎల్బీనగర్ మెట్రోను విజయవాడ మార్గంలో హయత్‌నగర్, వీలైతే పెద్ద అంబర్‌పేట వరకు పొడిగించాలని డిమాండ్లు ఉన్నాయి.
ఎన్నికల ప్రచారంలోనూ బీఆర్ఎస్‌కు పనికొస్తోంది
హయత్‌నగర్ వరకు మెట్రో పొడిగిస్తామని బీఆర్ఎస్ చాలాసార్లు ప్రకటించింది. నిన్న హైదరాబాద్ శివార్లలోని కుత్బుల్లాపూర్ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తమను గెలిపిస్తే మీ నియోజకవర్గం వరకు మెట్రో తీసుకొచ్చే బాధ్యత తనదని చెప్పారు. అంటే బాలానగర్ నుంచి జీడిమెట్ల వరకు కూడా మెట్రో విస్తరించే ప్రణాళిక పాలకుల మనసులో ఉందా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మెట్రో తెచ్చింది మేమే.. విస్తరించేదీ మేమే అంటున్న కాంగ్రెస్
మరోవైపు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌కు మెట్రో తీసుకొచ్చింది తామేనని గుర్తు చేస్తోంది. ఎల్బీనగర్ నుంచి ఆరాంఘర్, అత్తాపూర్, మెహిదీపట్నం, గచ్చిబౌలి మీదుగా బీహెచ్ఈఎల్ వరకు 35 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని విస్తరిస్తామని ఏకంగా మేనిఫెస్టోలనే ప్రకటించింది.
నగరవాసులందరినీ ఆకట్టుకోవడానికే..
మెట్రో ప్రయాణం నగరవాసుల జీవితంతో పెనవేసుకుపోతోంది. ట్రాఫిక్ ఇబ్బందులను చాలా వరకు తీర్చిన మెట్రో తమ ప్రాంతం వరకు వస్తే బాగుండని నగర వాసులు భావిస్తున్నారు. మెట్రో లైన్ విస్తరించిన ప్రాంతాల్లో భూములు, భవనాల రేట్లు పెరగడంతో యజమానులూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి నగర వాసులందరినీ ఆకట్టుకోవడానికి మెట్రో మ్యాజిక్ పని చేస్తుందని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే మెట్రో మీదే హామీలు గుప్పిస్తున్నాయి.