కరీంనగర్‌లో పొలిటికల్ హీట్.. గంగుల వర్సెస్ బండి..!
గడిచిన నాలుగేళ్లు ఎంపీగా కరీంనగర్‌కు బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు గంగుల కమలాకర్. తాను చేసిన అభివృద్ధి పనుల దగ్గర సెల్ఫీ తీసుకుంటానని.. బండి సంజయ్ ఎక్కడ సెల్ఫీ తీసుకుంటారో చెప్పాలన్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్‌కి చేరుకుంది. గంగుల కమలాకర్, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం పెరిగి రోజురోజుకూ ముదురుతోంది. ఓట్ల పోలరైజేషన్ కోసం బీజేపీ, బీఆర్ఎస్ నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. హిందూ ఓట్లు తన చేయి దాటిపోకుండా బండి సంజయ్.. మైనార్టీ ఓట్లు గంపగుత్తగా తనకే పడేలా గంగుల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆదివారం కరీంనగర్‌లో ప్రచారం నిర్వహించిన సంజయ్.. తాను నోరు విప్పితే నియోజకవర్గంలో గంగుల తిరగలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు, కేసీఆర్ నిజమైన హిందువులైతే ఓవైసీ సోదరులను హనుమాన్ ఆలయానికి తీసుకువచ్చి బొట్టు పెట్టి, చాలీసా చదివించే దమ్ముందా అంటూ గంగులకు సవాల్ విసిరారు. తాను వందల కోట్లు సంపాదించానని గంగుల ఆరోపిస్తున్నారని.. నిరూపిస్తే ఆస్తులన్ని కరీంనగర్ ప్రజలకు రాసిస్తానన్నారు సంజయ్.
మరోవైపు గడిచిన నాలుగేళ్లు ఎంపీగా కరీంనగర్‌కు బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు గంగుల కమలాకర్. తాను చేసిన అభివృద్ధి పనుల దగ్గర సెల్ఫీ తీసుకుంటానని.. బండి సంజయ్ ఎక్కడ సెల్ఫీ తీసుకుంటారో చెప్పాలన్నారు. వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడే కరీంనగర్ స్మార్ట్ సిటీగా తయారైందని, సంజయ్ కొత్తగా చేసింది ఏం లేదన్నారు గంగుల. అవినీతి, అక్రమాల కారణంగానే సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్నారు గంగుల. మతం పేరుతో రెచ్చగొడితే ఓట్లు పడవన్నారు.
2018 ఎన్నికల్లో బండి సంజయ్‌పై దాదాపు 14 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు గంగుల కమలాకర్. గంగుల 80 వేల ఓట్లు సాధించగా.. సంజయ్ 66 వేల ఓట్లు సాధించారు. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సంజయ్ కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఇద్దరు నేతలు తలపడుతున్నారు.