కామారెడ్డిలో పొలిటికల్ హీట్.. ఎలక్షన్ ఏజెంట్ గా రేవంత్ రెడ్డి తమ్ముడు
కొండల్ రెడ్డి, కామారెడ్డిలో ఎలక్షన్ ఏజెంట్ గా ఐడీ కార్డ్ తెప్పించుకోవడం సంచలనంగా మారింది. అది కూడా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి తరపున ఆయన ఎలక్షన్ ఏజెంట్ కావడం మరింత విశేషం.
రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఆయన సోదరుల హల్ చల్ ఎక్కువగా ఉంది. ఆయన నలుగురు సోదరులు.. తిరుపతి రెడ్డి, జగదీశ్వర రెడ్డి, కొండల్ రెడ్డి, కృష్ణా రెడ్డి ఈ రెండు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి అన్నయ్య తిరుపతి, తమ్ముడు కృష్ణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇద్దరు తమ్ముళ్లు కొండల్ రెడ్డి, జగదీశ్వర రెడ్డి కామారెడ్డి వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో కొండల్ రెడ్డి మరింత యాక్టివ్ గా ఉంటారు. ఆయన కామారెడ్డిలో ఎలక్షన్ ఏజెంట్ గా ఐడీ కార్డ్ తెప్పించుకోవడం సంచలనంగా మారింది. అది కూడా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి తరపున ఆయన ఎలక్షన్ ఏజెంట్ కావడం మరింత విశేషం. స్థానికేతరుడైన కొండల్ రెడ్డికి ఇక్కడ ఎలక్షన్ ఏజెంట్ గా ఎందుకు పర్మిషన్ ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
స్థానికేతరులంతా నిన్న ప్రచారం పూర్తవగానే నియోజకవర్గం వదిలి వెళ్లిపోయారు. కానీ ఎలక్షన్ ఏజెంట్ ని అని చెబుతూ కొండల్ రెడ్డి, కామారెడ్డిలోనే ఉండిపోయారు. పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఆయన తన ఐడీకార్డ్ చూపించారు. స్వయానా పీసీసీ అధ్యక్షుడు తమ్ముడైన కొండల్ రెడ్డి.. ఇండిపెండెంట్ అభ్యర్థి తరపున పాస్ ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.
కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో ఎన్నికల సంఘం ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఇక్కడ రూ.60 లక్షల నగదు లభించినట్టు ప్రచారం జరుగుతున్నా.. అధికారులు ధ్రువీకరించలేదు. ఇక కర్నాటక వాహనాలు కూడా కామారెడ్డిలో తిరుగుతున్నాయని.. అనుమానాస్పద వ్యక్తులు నియోజకవర్గంలో సంచరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే వారు సర్వేకు వచ్చినట్టు తెలిపారు. సైలెంట్ పీరియడ్ లో కూడా కొందరు అనుమానాస్పద వ్యక్తులు కామారెడ్డిలో తిష్టవేశారని అంటున్నారు. ఏకంగా రేవంత్ రెడ్డి తమ్ముడే.. కామారెడ్డిలో ఉండి ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షిస్తుండటం విశేషం.
♦