Telugu Global
Telangana

రియల్ గలగలలు vs విమర్శల వరదలు..!

భూముల వేలం.. వస్తున్న ఆదాయం.. అంతా ఉత్త ట్రాష్ అని ప్రతిపక్ష నేతలు కొట్టి పడేస్తున్నారు. రియల్ రంగం పడిపోలేదని చెప్పేందుకే ప్రభుత్వం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు.

రియల్ గలగలలు vs విమర్శల వరదలు..!
X

తెలంగాణలో రియల్ రంగం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం ఎక్కడ భూముల వేలం వేసినా.. లక్ష్యాన్ని మించి ఆదాయం సమకూరుతోంది. ఇటీవల జరిగిన కోకాపేట భూముల వేలం, మోకిలలో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం.. ప్రజల నుంచి వెల్లువెత్తిన డిమాండ్ చూస్తుంటే.. ఇది నిజమే అని ఎవరైనా అంగీకరిస్తారు. మరోవైపు.. జనం నుంచి వస్తున్న డిమాండ్‌తో ప్రభుత్వం కూడా ఆనందంగా ఉన్నట్టే కనిపిస్తోంది. ఇదే సందర్భం.. రాజకీయ విమర్శలకు సైతం ఊతమిస్తోంది.

భూముల వేలం.. వస్తున్న ఆదాయం.. అంతా ఉత్త ట్రాష్ అని ప్రతిపక్ష నేతలు కొట్టి పడేస్తున్నారు. రియల్ రంగం పడిపోలేదని చెప్పేందుకే ప్రభుత్వం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రచారం కోసమే.. ఎకరా వంద కోట్లు.. అని చెప్పుకొంటున్నారంటూ బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కామెంట్ చేశారు. భూముల అమ్మకం తీరును విమర్శించారు. గతంలో ప్రభుత్వ భూములు అమ్మవద్దని ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పుడు ఎలా భూములు అమ్ముతారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

మరోవైపు.. బీఎస్పీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సైతం ఇదే తీరుగా స్పందించారు. ఇదో చీకటి దందా అన్నారు. తమ సారథ్యంలో బహుజన రాజ్యం వస్తుందని.. ఇప్పుడు ప్రభుత్వం వేలం వేసిన ప్రతి గజాన్ని.. తమ ప్రభుత్వం వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ప్రభుత్వమే రియల్ దందాను ప్రోత్సహిస్తోందంటూ విమర్శించారు.

ఇలాంటి విమర్శలను ప్రభుత్వ ప్రతినిధులు.. అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు లైట్‌గా తీసుకుంటున్నారు. తమకు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని.. ఆ దిశగానే ప్రభుత్వ చర్యలుంటాయని స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల విమర్శలకు రియల్ కౌంటర్లు ఇస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.

First Published:  8 Aug 2023 8:23 PM IST
Next Story